మీరేదో కోట్లిచ్చినట్టు.. మాకు లెక్కవెట్టరానట్టు

మీరేదో కోట్లిచ్చినట్టు.. మాకు లెక్కవెట్టరానట్టు - Sakshi


బీజేపీ సభ్యులపై మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం

‘ఉదయ్‌’లో చేరకపోవడంతో నష్టం వాటిల్లిందన్న ప్రభాకర్‌ వ్యాఖ్యలపై ఫైర్‌

క్షమాపణకు బీజేపీ సభ్యుల డిమాండ్‌.. పోడియం వద్ద ఆందోళన

మంత్రులు సముదాయించినా కొనసాగిన నిరసన.. సభ నేటికి వాయిదా




సాక్షి, హైదరాబాద్‌: ‘కేంద్ర ప్రభుత్వం ఇంటిం టికి కరెంటు ఇస్తే వద్దన్నామా, రూ.10 వేల కోట్లు ఇస్తామంటే వద్దన్నామా, ఆరు నెలలు తిరగకముందే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా నివారించాం. ఇళ్లు, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ ఇస్తున్నాం. ఎన్టీపీసీ నుంచి విద్యుత్‌ అడిగితే మార్వాడిలా బేరమాడారు. ఉదయ్‌ పథకంలో చేరితే రూ.కోట్లు వస్తాయా, అసలు ఏముంది అందులో.. చిన్న వెసులుబాటు తప్పితే. అదేదో రాష్ట్రానికి మోదీ వేల కోట్లు ఇచ్చినట్లు.. మేము లెక్కపెట్టుకోలేకపోయా మన్నట్లు మాట్లాడుతు న్నారు’ అంటూ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం శాసనసభలో మండి పడ్డారు.


ఉదయ్‌ పథకంలో చేరకపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందన్న బీజేపీ సభ్యుడు ఎంవీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. లోయర్‌ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంతోపాటు తెలంగాణలోని ఏడు మండ లాలను చంద్రబాబుకు మోదీ అప్పగించారని జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. దీంతో ఆయన క్షమాపణ చెప్పాలం టూ బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి, సభ్యులు లక్ష్మణ్, ప్రభాకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ వాయిదా పడేదాకా వారు నిరసన కొనసాగించారు. తానేమీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని జగదీశ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే రికార్డులు చూసుకో వచ్చని, ఒకవేళ అలా ఉన్నట్లు తేలితే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతల్లేవా అని ప్రశ్నించారు. అక్కడ ఆర్నెల్లలో కోతల్లేకుండా చేసి చూపించాలన్నారు. బీజేపీ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది.



విద్యుత్‌ చార్జీల భారం ఉండదు

ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు భారం వేయబోమని జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఈఆర్సీ సూచనలు పాటిస్తామని, డిస్కంల అంతర్గత సామర్థ్యం పెంచుకుంటామని చెప్పారు. విద్యుత్‌ చార్జీల పెంపు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అంశంపై కాంగ్రెస్‌ సభ్యుడు  జీవన్‌ రెడ్డి తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. సింగరేణి వారసత్వ ఉద్యో గా లకు కట్టుబడి ఉన్నామని, వారిని నిరాశ పరచ బోమన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. విద్యుత్‌ శాఖలో పని చేసే 24 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.



ఉపాధి నిధులు మురిగిపోకుండా చూస్తాం: జూపల్లి కృష్ణారావు

రూ.400 కోట్ల ఉపాధి నిధులు మురిగి పోకుండా గత జనవరిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంజూరు ఇచ్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మార్చి 31 నాటికి ఖర్చు కాకపోతే మురిగిపోవని తెలి పారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి అడిగిన సందేహానికి మంత్రి వివరణ ఇచ్చారు.



విద్యుత్‌ చార్జీలు పెంచి అధికారం కోల్పోయాయి: ఎంవీవీఎస్‌ ప్రభాకర్‌

గతంలో విద్యుత్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయని బీజేపీ సభ్యుడు ఎంవీవీఎస్‌ ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమన్న హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.



సభలో మూడు బిల్లులు

జీతాలు, పింఛన్ల చెల్లింపుల సవరణ బిల్లు, తెలంగాణ భూదాన్, గ్రామదాన్‌ సవరణ బిల్లు, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లును స్పీకర్‌ సభలో ప్రవేశపెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top