ఉద్యోగ ప్రతిపాదనలు సిద్ధం చేయండి!

ఉద్యోగ ప్రతిపాదనలు సిద్ధం చేయండి! - Sakshi


‘పౌరసరఫరాల’ అధికారులకు మంత్రి ఈటల ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల సంస్థ అవసరాల మేర ఉద్యోగులను నియమించు కునేందుకు ఉద్యోగాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ, పౌరసర ఫరాల సంస్థ, తూనికలు, కొలతల శాఖ అధికారులతో ఆయన సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. 2015–16లో కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని నూరుశాతం సేకరించామని, 2016–17లోనూ అదే లక్ష్యంగా పెట్టుకోవా లన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామని, తూనికలు, కొలతల శాఖలోనూ అక్రమా లను అరికడతామన్నారు.


రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ విధానం ప్రవేశపెట్టి బోగస్‌ లబ్ధిదారులకు బియ్యం అందకుండా చర్యలు చేపడతామన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) నియమాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్డుల, రేషన్‌ షాపుల క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ నిబంధనల మేరకు రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచే విషయంలో అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీపం పథకం కింద వంట గ్యాసు కనెక్షన్లు అడిగనన్ని ఇస్తామని, గతంలో మంజూరైన కనెక్షన్లు వెంటనే అందజేయడానికి గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు.


అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన సౌకర్యం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడతామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలను సమగ్రంగా తయారు చేయాలని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. పెట్రోలు బంకులు, మాల్స్, దుకాణల్లో తూనికలు, కొలతల్లో అక్రమాలను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, కమిషనర్‌ సీవీ ఆనంద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top