కోటి ఎకరాల మాగాణం చారిత్రక కర్తవ్యం

కోటి ఎకరాల మాగాణం చారిత్రక కర్తవ్యం


► నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో మంత్రి హరీశ్‌రావు

► ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలి

►  తప్పుడు కేసులపై కోర్టులో సమర్థంగా వాదించాలి

►  ఉన్నతాధికారులతో 10 గంటలపాటు సమీక్ష  




సాక్షి, హైదరాబాద్‌: కోటి ఆశలతో సాధించి తెచ్చుకున్న తెలంగాణను కోటి ఇరవై లక్షల ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న చారిత్రక కర్తవ్యమని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం, అన్ని స్థాయిల సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. నీటిపారుదలశాఖ ముందున్న లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, పనుల పురోగతిపై ఇంజనీర్లతో హరీశ్‌రావు శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం 2.30కు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సుమారు 10 గంటలపాటు సాగింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నుంచి గతేడాది 35 వేల ఎకరాలు సాగులోకి తేవడంతో జరుగుతున్న రివర్స్‌ వలసలను మంత్రి ప్రస్తావించారు.


ఉపాధి కోసం హైదరాబాద్‌ తదితర నగరాలకు గతంలో కుటుంబాలతోపాటు వలస వెళ్లిన ఆందోల్, పుల్కల్‌ ప్రాంతాలకు చెందిన 759 మంది రైతులు... సింగూరు నీళ్లు పొలాల్లోకి చేరడంతో తిరిగి సొంత గడ్డకు వాపసు వచ్చేశారన్నారు. ఇంతకు మించిన ఆనందం నీటిపారుదలశాఖకు ఇంకేమి ఉంటుంద న్నారు. దేవాదుల, ఏఎంఆర్‌పీ, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల మేర భూసేకరణ సమస్యలు ఉన్నాయని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వల్ల వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నామని హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు గ్రీన్‌ ట్రిబ్యునల్లో, హైకోర్టులో తప్పుడు కేసులు వేయిస్తున్నా యని తెలిపారు.


ఈ కేసులను సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రజాప్రయోజనాల గురించి బలంగా వాదించాలని ఇరిగేషన్‌ లీగల్‌ టీమ్‌ను ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కరించుకొని త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషీ, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ ప్రకాశ్, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, అటవీశాఖ కన్సల్టెంట్‌ సుధాకర్‌ సహా 15 మంది చీఫ్‌ ఇంజనీర్లు, లీగల్‌ సెల్‌ అధికారులు పాల్గొన్నారు.



నాణ్యతలో రాజీ వద్దు..

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సాగునీటి పనులు, భారీ నిర్మాణాలపై నిరంతరం తనిఖీ అవసరమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇంజనీర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, వివిధ సాగునీటి పనులపై వచ్చే ఆరోపణలు, ఇతర విచారణల కోసం క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడరాదని క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల నిర్వహణ, డ్యామ్‌ల రక్షణ, భద్రతపై విస్తృతంగా చర్చించారు. డ్యామ్‌ సేఫ్టీ తదితర అంశాలపై సెంట్రల్‌ డిజైన్స్‌ సి.ఈ. నరేందర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top