ఎప్పుడైనా కరెంట్ సరిగా ఇచ్చారా?

ఎప్పుడైనా కరెంట్ సరిగా ఇచ్చారా? - Sakshi


ఢిల్లీ పెద్దలకు సద్దులు మోయడమే సరిపోయింది

కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం  


 

సూర్యాపేట/నకిరేకల్: కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ట్యాంక్‌బండ్, కూరగాయల మార్కెట్, నకిరేకల్‌లో  నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్‌బండ్ పనులను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఒక్కనాడైనా కరెంటు సరిగా ఇచ్చారా అని ప్రశ్నించారు.  రైతులకు ఏనాడూ నాణ్యమైన కరెంటు ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దేశానికి అన్నంపెట్టే రైతన్న బాగుండాలని పరిశ్రమలను వదిలి ముందుగా రైతాంగానికి తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చారన్నారు.



ఈ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్న కాలంలో డిండి ఎత్తిపోతల, ఫ్లోరైడ్ గురించి ఏనాడూ పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అదే ఆయన ఆంధ్రాకు మూడో పంట నీరిచ్చే పులిచింతలను దగ్గరుండి కట్టించారని విమర్శించారు. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకుంటున్నారని.. భూములు ఇవ్వొద్దని హైకోర్టులో కేసులు వేస్తున్నారని.. ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 



 తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను విస్మరించిన కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్లుగా ఢిల్లీ పెద్దలకు.. ఆంధ్ర నాయకులకు సద్దులు మోయ డంతోనే సరిపెట్టుకున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మహారాష్ట్రతో చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందంతో మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తవుతుందని.. దీంతో వరంగల్, సూర్యాపేట ప్రాంతాలకు నీరందుతుందన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు.. ఎల్‌ఎండీసీ అక్కడి నుంచి ఎస్సారెస్పీకి నీరొస్తుందని.. దీంతో ఈ ప్రాంతంలోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపవచ్చన్నారు.

 

 ‘విపక్షం గల్లంతు ఖాయం’

 కాంగ్రెస్ పెద్ద నాయకులకు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పొద్దున ఒక మాట.. సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ నేతలు బట్టలు చింపుకొని రోడ్లపై తిరగాల్సిన రోజులు రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయి లో అమలు చేస్తామని.. రానున్న రోజుల్లో అసలు ప్రతి పక్షం మిగలదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీ శాఖ రాష్ట్ర చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ రవీందర్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top