8 గ్రామాలు .. 3 గంటలు

8 గ్రామాలు .. 3 గంటలు - Sakshi


అడవులు, పల్లెల్లో కలియదిరిగిన మంత్రి హరీశ్‌రావు



సిద్దిపేట జోన్‌:  సిద్దిపేట జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు శుక్రవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు దిగారు. ఎనిమిది గ్రామాల్లో మూడు గంటలపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి రంగనాయక సాగర్‌ ఎడమ కాలువ పనులను పరిశీలించారు. సుమారు 21.925 కిలోమీటర్ల పొడవున కొనసాగుతున్న కాలువ పనులను అడుగడుగునా తనిఖీ చేశారు.



సిద్దిపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ శివారు నుంచి పెద్దలింగారెడ్డి పల్లి, పుల్లూరు, దాసరివాడ, రామంచ, మల్యాల, గంగాపూర్‌ మీదుగా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ వరకు మంత్రి కలియదిరిగారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని, సిమెంట్‌ లైనింగ్‌ పనులకు క్యూరింగ్‌ తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పగుళ్లు ఏర్పడతాయని, వాటిని పట్టుకొని విపక్షాలు దుష్ప్రచారం చేస్తాయని, నీళ్ల మంత్రిగా తనకు అనవసరంగా చెడ్డ పేరు తేవొద్దని అధికారులకు సూచించారు.



డిసెంబర్‌ నాటికి గోదారి జలాలు

అక్కడక్కడా రైతులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తామని, బీడువారిన భూముల్లో గోదావరి జలాలను పారిస్తానని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిజానికి జూన్‌ నాటికి నీటిని తరలించాల్సి ఉందని, దేవుడు కరుణించి అధికారులు, సిబ్బంది పనులను త్వరితగతిన పూర్తి చేస్తే, ఏ ఆటంకం కలుగకుంటే డిసెంబర్‌ నాటికి గోదావరి నీటిని తెస్తానని పేర్కొన్నారు. కాలువల్లో నీరు పారితేనే రైతుల బతుకులు మారుతాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top