నీరడిగా పనిచేస్తా..!

నీరడిగా పనిచేస్తా..! - Sakshi

- కోటి ఎకరాల మాగాణి లక్ష్యం: మంత్రి హరీశ్‌రావు  

ఈ ఏడాదిలో మిడ్‌మానేరును నింపుతాం 

భవిష్యత్‌ ఉండదనే టీఆర్‌ఎస్‌పై విపక్షాల దుష్ప్రచారం 

 

సాక్షి, సిద్దిపేట: కోటి ఎకరాల మాగాణి కోసం తాను నీరడిగా పనిచేస్తున్నానని, ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టులు కట్టి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బస్‌స్టేషన్‌ ఆధునీకరణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ తాము ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోందని విమర్శించారు. కోండ పోచమ్మసాగర్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వద్దని జేఏసీ చైర్మన్‌ కోదండరాం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు భూమి మీద కట్టకుంటే ఆకాశంలో కట్టాలా? అని ప్రశ్నించారు.



ఒక్క కాశేశ్వరం ప్రాజెక్టుపై 110 కేసులు వేశారని, కేసీఆర్‌ ప్రాజెక్టులు కడితే తమ భవిష్యత్‌ అంధకారంలో పడు తుందనే భయంతో  అడ్డుకుంటూ టీఆర్‌ఎస్‌పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరులో 10 టీఎంసీల నీళ్లు నింపి, ఈ ఏడాదిలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి తమకు భవిష్యత్‌ ఉండదని, టీఆర్‌ఎస్‌పై విపక్షాలు బురదజల్లుతున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆస్పత్రిలో ఐదు రోజుల్లో 63 మంది చిన్నపిల్లలు చనిపోయారని, మధ్యప్రదేశ్‌లో పంట రుణాలను మాఫీ చేయాలని అడిగితే రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చివేశారని, ఈ ఘటనలే బీజేపీ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.



కాంగ్రెస్‌ హయాంలో ఇసుక ఆదాయం రూ.4 కోట్లు వస్తే, తెలంగాణ ప్రభుత్వం ఈ మూడేళ్లలో రూ.400 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మిగిలిన డబ్బు ఏ కాంగ్రెస్‌ నాయకుడి జేబులో జమ అయిందో చెప్పాలన్నారు. పేకాట క్లబ్‌లను మూయించామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎరువుల కోసం పోలీస్‌స్టేషన్ల వద్ద లైన్లో నిలబడే వారని, విత్తనాల కోసం మార్కెట్‌ యార్డుల వద్ద పడిగాపులు కాసేవారన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ కేసు పెట్టి జైలు శిక్ష విధించేలా కేసీఆర్‌ చట్టం తెచ్చారన్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top