పేదల ఎజెండాగా అసెంబ్లీ నడిపాం

టీఆర్‌ఎస్‌ఎల్పీలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో సునీత, కొప్పుల ఈశ్వర్‌ - Sakshi


విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

18 రోజులపాటు నిర్వహించి రికార్డు సృష్టించాం

చిత్తశుద్ధితో ప్రతిఅంశంపై చర్చించాం..

సభ నిర్వహణపై ప్రతిపక్షాలు శభాష్‌ అన్నాయి

తొలిసారిగా మత్స్యకారుల గురించి చర్చించామని వెల్లడి




సాక్షి, హైదరాబాద్‌: ‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 18 రోజులపాటు నిర్వహించి రికార్డు సృష్టించాం. విపక్షాలతో సభలో శభాష్‌ అనిపించుకున్నాం. జాతీయ స్థాయిలో సభల నిర్వహణకు తెలంగాణ అసెంబ్లీ ఆదర్శంగా నిలిచింది. సభానాయకుడిగా కేసీఆర్‌ ఉదార వాదిగా, మానవతావాదిగా వ్యవహరించారు కాబట్టే సమావేశాలు సజావుగా నడిచాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా అసెంబ్లీని నడిపించాం’ అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కోరినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతీ అంశంపై చర్చ జరిపిందని తెలిపారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, విప్‌లు గొంగిడి సునీత, నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే పుట్టు మధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టసభలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అసహనం పెరుగుతున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ప్రజాస్వామ్య విలువలను పెంచిందని, అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. గతంలో సభా నాయకుల సంకుచిత మనస్తత్వం, అహంభావంతో సభలు సరిగా నడిచేవి కావని, కానీ సీఎం కేసీఆర్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. సమయంతో నిమిత్తం లేకుండా చర్చలు అర్థవంతంగా, మూస ధోరణికి భిన్నంగా నడిచాయని వివరించారు.



ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ప్రశ్నించేలా..

గతంలో సమావేశాల్లో విలువలకు శిలువలు పడిన పరిస్థితిని చూశామని, ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ప్రశ్నించేలా, అధికార పక్షం సమస్యలు పరిష్కరించేలా సమావేశాలు జరిగాయని హరీశ్‌ తెలిపారు. సభ్యులు అడిగిన దాంట్లో న్యాయం ఉందనుకుంటే ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా కేసీఆర్‌ అంగీకారం తెలిపారని, విపక్షాలు సభ బయట చెప్పినవన్నీ అబద్ధమని అసెంబ్లీలో నిరూపించగలిగామని చెప్పారు. 15 అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగడం తనకు తెలిసి ఇదే మొదటిసారని వివరించారు. గతంలో ఎప్పుడూ శీతాకాల సమావేశాలు ఇన్ని రోజులపాటు జరగలేదని, అత్యధికంగా 1999లో 10 రోజులు, 2005లో 13 రోజులు జరగడమేనని పేర్కొన్నారు. ఇక 2011–12లో కేవలం 3 రోజులు మాత్రమే శీతాకాల సమావేశాలు జరిగాయన్నారు.



సభ హుందాతనం పెంచిన సీఎం

సభలో విధాన పరమైన ప్రకటనలు చేసి సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ హుందాతనం పెంచారని, హౌసింగ్‌పై చర్చ సందర్భంగా రూ.36 వేల కోట్ల బకాయిలు మాఫీ చేస్తామని ప్రకటించి విపక్షాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారని హరీశ్‌రావు అన్నారు. తొలిసారిగా మత్స్యకారుల గురించి సభలో చర్చించి వారికి భరోసా ఇచ్చారన్నారు. గతంలో సమావేశాల్లో విద్యుత్‌ అంశంపై రచ్చ జరిగేదని, కానీ ఈసారి ఆ పరిస్థితే ఎదురు కాలేదని, అన్న ప్రకారం రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నందునే ఇది సాధ్యమైందని తెలిపారు. సింగరేణి అంశంపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి చేసిన సూచనలనూ సీఎం ఆమోదించారని గుర్తు చేశారు. అభినందనలు తెలపడం మినహా ప్రతిపక్షాలు ఏం చేయలేకపోయాయని వ్యాఖ్యానించారు. శాసన మండలిలోనూ అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు.



మంత్రి లక్ష్మారెడ్డికి కితాబు

సమావేశాల్లో ఎక్కువ ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జవాబిచ్చారని హరీశ్‌ కొనియాడారు. అర్థవంతమైన చర్చ జరిపితే ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధమని ఈ సమావేశాల ద్వారా రుజువు చేశామని, పోడియంలోకి వస్తే సస్పెండ్‌ చేస్తామని ముందే చెప్పామని, ఒక రోజు ఆ పరిస్థితి కూడా వచ్చిందని తెలిపారు. సభా నేతకు ఇచ్చిన గౌరవమే ప్రతిపక్ష నేతకూ ఇచ్చామని, ఆయన మాట్లాడటానికి లేస్తే, మంత్రులం కూర్చుని అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. పొరుగున ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసని, దానికి భిన్నంగా సమావేశాలు జరిగాయని తెలిపారు. తాము మొండితనానికి పోలేదు కాబట్టే సమావేశాలు హుందాగా జరిగాయని, సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top