అదిగదిగో కాళేశ్వరం!

అదిగదిగో కాళేశ్వరం! - Sakshi


ఇంజనీర్‌గా అవతారమెత్తిన మంత్రి హరీశ్‌రావు  

- నిజామాబాద్‌ జిల్లా వాసులకు పవర్‌ ప్రజెంటేషన్‌

- ప్రాజెక్ట్‌ సమగ్ర స్వరూపంపై విశదీకరణ

- 900 కోట్లతో మిడ్‌మానేరు టూ పోచంపాడుకు గ్రీన్‌ సిగ్నల్‌

- తిలకించిన మంత్రి పోచారం, ఎంపీలు, ఎమ్మెల్యేలు




సిద్దిపేటజోన్‌: భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇంజనీర్‌గా అవతారమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర రూపాన్ని పవర్‌ ప్రజెం టేషన్‌ ద్వారా సుమారు గంటపాటు నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు, రైతులకు వివరించారు. దేవుడు కరుణిస్తే డిసెంబర్‌ వరకు లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌ గ్రామశివారులో కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని, తుమ్మిడిహట్టి ప్రాంతాన్ని మార్చి సులభతరంగా, ముంపు లేకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించి అన్నారం, సుందిల్ల ప్రాంతాల్లో బ్యారేజీల ద్వారా గోదా వరి నీటిని ఒడిసి పట్టే విధానాన్ని వివరించారు.



గోదావరి నదిలోని 35 టీఎంసీల నీటిని 3 బ్యారేజీల ద్వారా తరలించి సాగునీటినందిం చే బృహత్తర కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును రీ డిజైనింగ్‌ చేసి 200 టీఎంసీలతో 18 లక్షల ఎకరాలతోపాటు, ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, సింగూరు, నిజాంసాగర్‌ల మరో 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టుకు మొత్తంగా 36 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తామన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి గందమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ల ద్వారా ఫ్లోరైడ్‌ ప్రాంతాలైన భువనగిరి, ఆలే రు, తుంగతుర్తి, నకిరేకల్‌ ప్రాంతాలకు గోదా వరి జలాలను తరలించే ఆలోచనను మ్యాప్‌ ద్వారా వివరించారు. సిద్దిపేట జిల్లాలో కొండపొచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తరలించి అక్కడి రిజర్వాయర్‌ నుంచి గ్రావిటి పద్ధతి ద్వారా శామీర్‌పేట చెరువును నింపే ఆలోచనను రైతులకు విశదీకరించారు. మల్లన్నసాగర్‌ నుంచి హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా ద్వారా నిజాంసాగర్‌కు నీరందించి ఇందూరు జిల్లా రైతాంగానికి సాగునీటిని ముంగిట్లోకి తెస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, నిజాంసాగర్‌ను గంగమ్మ తల్లితో జలకళ సంతరింపచేస్తామని హరీశ్‌ వివరించారు.



డిసెంబర్‌లోగా లక్ష్యాన్ని అధిగమిస్తాం

కాలం కలిసొస్తే డిసెంబర్‌లోనే నీరు తెచ్చి ఉత్తర తెలంగాణ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు అనుసంధానం చేసి లిప్ట్‌ ప్రక్రియ ద్వారా నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, ప్రాంతాలకు నీరందించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు 900 కోట్లతో మిడ్‌మానేరు నుంచి పోచంపాడుకు వరద కాలువల సాగునీటిని అందించే ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, హన్మంత్‌షిండేతోపాటు నిజామాబాద్‌కు చెందిన వెయ్యి మంది ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top