తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకే చంద్రబాబు కుట్ర

తెలంగాణ  అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకే  చంద్రబాబు కుట్ర - Sakshi


* మంత్రి హరీష్‌రావు ఆరోపణ

* పీహెచ్‌సీ భవనం సహా రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


 జిన్నారం: తెలంగాణ అస్తిత్వాన్ని, రాష్ర్ట అభివృద్ధిని దెబ్బతీసేలా, విద్యుత్‌వాటాను అందించకుండా ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నట్లు మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బుధవారం జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 2 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్‌రావుతో కలిసి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ కష్టాలకు గత టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణమన్నారు.



విభజనలో భాగంగా తెలంగాణకు రావాల్సిన 54 శాతం విద్యుత్ వాటాను అందించకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అభివ ృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌వాటాపై చంద్రబాబును నిలయదీయకుండా తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతలు ఆందోళనలు చేయడం సరైంది కాదన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారన్నారు. తెలంగాణలో పుష్కలంగా బొగ్గు వనరులు ఉన్నా, ఆంధ్రలో మిగులు విద్యుత్ ఎలా ఉంటుంది. తెలంగాణలో ఎందుకు ఉండదని నేతలను ప్రశ్నించారు.



 గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కష్టాలు ఎదురువతాయన్నారు. అయినా సీఎం కేసీఆర్ విద్యుత్ కష్టాలకు తీర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మూడే ళ్ల తర్వాత రెప్పపాటు కాలం కూడా కరెంటు పోకుండా చేస్తామని సీఎం ఎప్పుడో చెప్పారన్నారు. కరెంటును ఉత్పత్తి చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వరినాట్లు ఉన్నందున పరిశ్రమలకు రెండు రోజుల విద్యుత్ కోతను విధించామని, కోత సమయం రాగానే ఒక రోజు విద్యుత్ కోతను ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బొల్లారంలో 5 లక్షల లీటర్ల మంజీర సంపును నిర్మించేందుకు, మోడల్ స్కూల్, పీహెచ్‌సీ చుట్టూ ప్రహరీని నిర్మించేందుకు నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.



గ్రామ శివారులోని మూడు రోడ్లను ఆర్‌అండ్‌బీకి అప్పగించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా నిర్మించిన పీహెచ్‌సీలో రూ. 75లక్షల నిధులతో హైరిస్క్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, ఇందుకు పరిశ్రమలు కూడా తమకు సహకరించేందుకు అంగీకరించాయని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.1.55కోట్ల రుణాల చెక్కును మంత్రి హరీష్‌రావు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, డీఎం అండ్ హెచ్‌ఓ బాలాజీ, ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, సర్పంచ్ రోజారాణి, నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, లక్ష్మారెడ్డి, హన్మంత్‌రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top