రిమ్స్ తీరుపై మంత్రి గుస్సా


పనులు చేయకపోవడంపై ఆరాతీశారు. కాంట్రాక్టర్ జవాబుపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘నేనేం అమాయకుడ్ని అనుకున్నావా..? రాష్ట్రంలో ఎక్కడా నువ్వు కాంట్రాక్ట్ చేయకుండా చేయగలను..’ అంటూ హెచ్చరించారు. రిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్‌ను వెంటనే మార్చుకోవాలని ఆదేశాలిచ్చారు.   ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని... ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందించడం ముఖ్యమని సూచించారు. అంతకుముందు నగరంలోని మాతాశిశు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మంత్రి మాట్లాడారు.

 

మధ్యాహ్నం నుంచి ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లావైద్య, ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు ఒకప్పుడు ఒంగోలులోనే ఎక్కువగా కనిపించేవని.. అలాంటి వాతావరణం మార్చేందుకు వైద్యులు సేవాభావంతో పనిచేయాలని  సూచించారు. రిమ్స్ ట్రామాకేర్ సిబ్బందితో పాటు 108, 104 సిబ్బందికి సకాలంలో జీతాలు అందిస్తామని.. రిమ్స్ బ్లడ్‌బ్యాంకు విస్తరణతో పాటు జిల్లాలో మిగతాచోట్ల ప్రతీ ఏరియా ఆస్పత్రిలోనూ బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.



రెవెన్యూ డివిజన్‌ల వారీగా నోడల్ అధికారులను నియమించి వారితో నిరంతర వైద్యసమీక్షలు చేయించే ప్రతిపాదనలున్నట్లు తెలిపారు. ప్రధానంగా అన్ని ఆస్పత్రుల్లో గైనిక్, ఎనస్థీషియా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైద్యులు ఆస్పత్రికి అందుబాటులో నివాసాలుండాలని.. విధులకు సకాలంలో హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

 

సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి త్వరలో జిల్లాల వారీగా జరగనున్న వైద్యరంగ అభివృద్ధిపై వివరించారు. ఆయనకు పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది, ఐఎంఏ సభ్యులు సన్మానం చేశారు. మంత్రి పర్యటనలో డీఎంఏ డాక్టర్ జి. శాంతారావు, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, మెడికల్ ఆర్డీ శాలినిదేవి, జిల్లావైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రయ్య, వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య తదితరులున్నారు.

 

ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు

ఒంగోలు టౌన్: ‘పేషంట్ దేవుడి లాంటివాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు. వారిని ప్రేమగా పలకరించాలి. ఆప్యాయంగా చూసుకోవాలి. ఈ రెండు చేస్తే ఆ రోగి సగం జబ్బు తగ్గుతోంది. మిగిలిన జబ్బును మనం ఇచ్చే వైద్యం ద్వారా తగ్గుతోంది. పేషంట్ లేకపోతే మనం లేమన్న విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యులకు ఉద్బోధించారు.  ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ వైద్యులతో బుధవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వం వైద్యులను దేవుడిలాగా చూసేవాళ్లని, మనం దానిని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 

నూటికి తొంభై శాతం పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారని, మన పద్ధతులను మార్చుకొని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనని, ఆరోగ్యంగా లేకుంటే మనం ఆరోగ్యంగా లేనట్లేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోధించేందుకు మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే లేని జబ్బులు వస్తాయని ప్రజల్లో భయం ఉందని, అందుకు కారణం అక్కడ ఉండే అపరిశుభ్రతేనన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచే కాంట్రాక్టు పొందినవాళ్లు సక్రమంగా పనిచేయకుంటే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలని, అప్పటికీ మారకుంటే మెమో ఇవ్వాలని, పరిస్థితిలో మార్పురాకుంటే వారుకట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు ఒక్కటే మిగిలి ఉందని, మిగతాదంతా కొత్తేనన్నారు. వైద్యులంతా మరింత కష్టపడి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలని మంత్రి కామినేని కోరారు.

 

‘సిక్’ అయితే ఎంత నష్టమో గుర్తించాలి - కొండపి ఎమ్మెల్యే

ఒక వ్యక్తి సిక్ అయితే ఎంత నష్టం జరుగుతుందో వైద్యులు గుర్తించాలని కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. ఇంటి యజమాని సిక్ అయితే ఆ కుటుంబమంతా ఆ రోజు ఆదాయం కోల్పోతుందని, విద్యార్థి సిక్ అయితే ఆ రోజు పాఠాలు కోల్పోతాడన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తాము తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం సరిగా లేకపోతే దానికి అందరూ బాధ్యులేనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యులతో ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయన్నారు. క్లస్టర్ల వ్యవస్థ వల్ల సమస్యలు ఏర్పడటం తప్పితే ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమిస్తే బాగుంటుందని సూచించారు.

 

 పీహెచ్‌సీని బ్రాందీ షాపుగా మార్చేశారు - కనిగిరి ఎమ్మెల్యే

 కనిగిరి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బ్రాందీ షాపుగా మార్చేశారని ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 15 పడకల ఆస్పత్రికి ఇన్‌చార్జి వైద్యుడు ఉన్నప్పటికీ నాలుగేళ్ల నుంచి బ్రాందీ షాపు నడుస్తూనే ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఎక్సైజ్ సీఐతో దానిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. సీఎస్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ఆయన కూడా ఇన్‌చార్జేనని, గట్టిగా రమ్మంటే రిజైన్ చేస్తానంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే అన్నిచోట్ల ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారన్నారు.

 

 పేరుకు ఆస్పత్రులు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పామూరులోని 30 పడకల ఆస్పత్రి కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, డీఎంఈ శాంతారావు,  కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ శాలినీదేవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top