ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. - Sakshi


► పదేళ్ల తర్వాత సిద్ధమైన మిడ్‌ మానేరు

► నెలాఖరుకల్లా 10 టీఎంసీల నీటి నిల్వ

► మిగతా పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి

► తొలి విడతలో 70 వేల ఆయకట్టుకు నీరు




సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌: పదేళ్ల కల సాకారం కాబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు, ఇందిరమ్మ వరద కాల్వకు ఆయువు పట్టులాంటి మిడ్‌ మానే రు డ్యామ్‌ త్వరలో జలకళ సంతరించు కోనుంది. 2006లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరదకాల్వ ఆధారంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెలాఖరుకల్లా 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే అవకాశం లభించనుంది.


వచ్చే ఏడాది జూన్‌ నాటికి 25 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2006లో కరీంనగర్‌ జిల్లా మాన్వాడ (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆయన మరణాంతరం నిలిచిపోయాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. పదేళ్లలో యాభై శాతం పనులు జరగ్గా.. మిగిలిన పనులు కేవలం ఏడాదిలో పూర్తి కాబోతున్నాయి. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎట్టకేలకు ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.



ఐదుమార్లు చేతులు మారాక..

మిడ్‌మానేరు ప్రాజెక్టులో భాగంగా ఎడమ వైపు 5.2 కి.మీ, కుడివైపు 4.4 కి.మీ. దూరం మట్టికట్ట నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ కట్టకు రెండువైపులా 80 మీటర్ల చొప్పున నాన్‌ ఓవర్‌ ఫ్లో డ్యాం, మధ్యలో 388 మీటర్ల స్పిల్‌వే పనులు పూర్తికాగా.. 25 రేడియల్‌ గేట్లు అమర్చాల్సి ఉంది. కుడి కాల్వ కింద 1,89,000, ఎడమ కాల్వ కింద 10,500 ఎకరాల ఆయకట్టు నిర్దేశించారు. రూ.339 కోట్లతో కాంట్రాక్టు ఏజెన్సీలతో తొలి ఒప్పందం జరగ్గా.. 2010 వరకు 23 శాతం పనులే జరిగాయి. దీంతో అప్పటి ప్రభుత్వం కొత్తగా రూ.454 కోట్ల అంతర్గత అంచనాతో మళ్లీ టెండర్‌ పిలిచింది.


ఈ పనులను 20.5 శాతం తక్కువతో రూ.360.90 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ సక్రమంగా పని చేయకపోవడంతో రూ.117 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ నుంచి తొలగించారు. 2015లో మరో సంస్థకు కట్టబెట్టారు. అందులోనూ రూ.101.88 కోట్ల విలువైన పనులను తొలగించి మరో సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఇలా ఐదుమార్లు పనులు చేతులు మారాయి. గతేడాది జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లలో 303 మీటర్ల వరకు నిర్మించి 3.3 టీఎంసీలు నిల్వ చేయాలని ప్రభుత్వం భావించింది.


అయితే అంచనాకు అందని వరద రావడంతో మట్టికట్ట 40 మీటర్ల మేర (150– 190 మీటర్ల మధ్య) కోతకు గురైంది. కాంక్రీటు డ్యాం కంటే మట్టికట్టను మరింత ఎత్తు నిర్మించి ఉంటే కాంక్రీటు డ్యాం నుంచి నీరు వెళ్లిపోయేది. కానీ ఇవి రెండూ ఒకే ఎత్తులో ఉండడంతో మట్టికట్ట నుంచి నీరు వెళ్లి కోతకు గురైంది. దీంతో గత ఏడాది నీటి నిల్వ సాధ్యపడక ఆయకట్టుకు నీరందలేదు.



13 నెలల్లో 61 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని

ప్రాజెక్టులో మొత్తంగా 1.28 కోట్ల మట్టిపని, 4.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాల్సి ఉండగా.. అందులో 1.23 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 4.30 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తయింది. గత 13 నెలల కాలంలోనే 61 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 1.45 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తయింది. మొత్తంగా రూ.279 కోట్ల మేర నిధులు వెచ్చించారు. క్రస్ట్‌ గేట్ల వరకు పనులు పూర్తయ్యాయి. దీంతో నీళ్లొస్తే 10 టీఎంసీల నిల్వ సాధ్యం కానుంది.


కుడి కాల్వ కింద 70 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లభిస్తుంది. కుడి కాల్వ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కాకున్నా దిగువ ఎల్‌ఎండీ కింది ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం రెండు పంపులు నడిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 45 టీఎంసీల నీరొచ్చినా, మిడ్‌మానేరు పనులు పూర్తయితే గరిష్ట ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం లభిస్తుంది.


మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం

నీటి నిల్వ సామర్థ్యం - 25.873 టీఎంసీలు

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. కోట్లలో - 639

నిర్మాణానికి శ్రీకారం -  2006 ఫిబ్రవరి

ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు - 107

ముంపు గ్రామాలు - 12

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు - 358 కోట్లు

నిర్దేశిత ఆయకట్టు - 2,00000 ఎకరాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top