సూక్ష్మ పరిశీలన

సూక్ష్మ పరిశీలన - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు చేపట్టిన గుర్తింపు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా సాగుతోంది. ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దరఖాస్తులు స్వీకరించడం నుంచి ఆర్థిక భృతి అందించేవరకు అన్ని స్థాయిల్లో నిశితంగా పరిశీలన చేపట్టనున్నారు. కలెక్టర్‌ కూడా నేరుగా సూక్ష్మంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 8వ తేదీన



ప్రారంభమైన సర్వే.. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్‌ఓలను విలేజ్‌ ఇన్‌చార్జి ఆఫీసర్లుగా నియమించారు. వీరంతా జిల్లాలోని 415 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి అర్హులైన ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి పంచాయతీలో గ్రామసభ నిర్వహించి అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు అందజేసిన మరుసటి రోజు నుంచే పరిశీలన ప్రారంభమైంది. తొలుత వీఆర్‌ఓలు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత వీటిని తహసీల్దార్లకు అందజేస్తారు. అక్కడికి చేరుకున్న ప్రతి దరఖాస్తును మరోసారి తహసీల్దార్లు కూడా జల్లెడ పడతారు. పిదప వాటిని ఎంపీడీఓ కార్యాలయాలకు చేర్చి.. ఆసరా వెబ్‌పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం కలెక్టర్‌ కూడా పరిశీలన జరపనున్నారు.



పట్టణ ప్రాంతాల్లో ఇలా..

జీహెచ్‌ఎంసీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తుల స్వీకరణ విధానం లేదు. మీ–సేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. వివరాల నమోదు పూర్తిగా ఉచితం. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వీఆర్‌ఓలను డివిజనల్‌ ఇన్‌చార్జి ఆఫీసర్లు(డీఐఓ)గా నియమించారు. మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను డీఐఓలు పరిశీలిస్తారు. నివసించే ప్రాంతానికి వెళ్లి.. వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకుంటారు. ఆపై స్థాయిలో తహసీల్దార్లు మరోసారి పరిశీలన జరుపుతారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, బడంగ్‌పేట నగర పంచాయతీల్లో బిల్‌ కలెక్టర్లు వార్డు ఇన్‌చార్జి ఆఫీసర్లుగా కొనసాగుతారు.



అధికారుల మెడపై కత్తి..

ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందజేతను ప్రభుత్వం ప్రతిష్టాతక్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. అర్హుల ఎంపికలో ఎటువంటి అవకతవకలకూ తావివ్వకుండా జాగ్రత్త వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. గతంలో అనర్హులకు పింఛన్లు అందిన విషయం తెలిసిందే. ఒంటరి మహిళల విషయంలో.. అటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. పట్టణ ప్రాంతంలో తప్పిదాలు జరిగితే.. అధికారులను బాధ్యులుగా చేయనుంది. పరిశీలించిన ప్రతి దరఖాస్తుపై పరిశీలన జరిపిన అధికారి పేరు తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ విధానం వల్ల అనర్హులకు జాబితాలో చోటు ఉండదన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కలెక్టర్‌ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే లోతుగా ఎలా పరిశీలించాలన్న అంశంపై ఆయా శాఖాధికారులకు సలహాలు అందజేశారు. వీటిని తప్పకుండా పాటించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.



దరఖాస్తుల వెల్లువ

ఆర్థిక భృతి కోసం ఒంటరి మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఆ ఒరవడి కనపించింది.  శుక్రవారం రాత్రి వరకు 4,317 దరఖాస్తులు అందాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 1,201 మంది, గ్రామాల నుంచి 3,116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడువు శనివారం వరకు ఉండడంతో వీటి సంఖ్య ఐదు వేలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top