కిల్లర్స్‌గా మారుతున్న మెట్రో పిల్లర్స్‌!

కిల్లర్స్‌గా మారుతున్న మెట్రో పిల్లర్స్‌! - Sakshi


చైతన్యపురిలో మెట్రో రైల్‌ పిల్లర్‌ను ఢీకొన్న కారు

ఇద్దరు యువకుల మృతి, నలుగురికి గాయాలు

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడికి తీవ్ర గాయాలు

మద్యం మత్తు, మితిమీరిన వేగమే కారణం

అంతా 25 ఏళ్లలోపు యువకులే..  




హైదరాబాద్‌:

మద్యం మత్తు.. మితిమీరిన వేగం మరో రెండు ప్రాణాలను బలిగొన్నాయి. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మద్యం తాగిన యువకులు కారులో అత్యంత వేగంగా వెళుతూ హైదరాబాద్‌ మెట్రో రైలు పిల్లర్‌ను ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.



పుట్టినరోజు పార్టీ చేసుకుని..

వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన గుండగోని సాయికుమార్‌గౌడ్‌ (25), ఎటికల శ్రీనాథ్‌ (24), మన్సూరాబాద్‌కు చెందిన మాచర్ల చైతన్య (25), వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన కొమ్మరాజు చక్రపాణి (25), కొణితి జయచంద్రారెడ్డి (25), పందిళ్లపల్లి కృష్ణప్రసాద్‌ (24)లు స్నేహితులు. బుధవారం సాయికుమార్‌ పుట్టినరోజు కావటంతో వారంతా రాత్రి ఎనిమిది గంటల సమయంలో వనస్థలిపురం రామాలయం వద్ద కలుసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలోని ఓ బార్‌కు వెళ్లి అర్ధరాత్రి దాటే వరకు మద్యం తాగారు. బార్‌ నుంచి బయటికి వచ్చాక బిర్యానీ తినేందుకు సంతోష్‌నగర్‌లోని బిర్యానీ మండి సెంటర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాయికుమార్‌కు చెందిన స్విఫ్ట్‌ కారు (ఏపీ29బీవీ 2888)లో బయలుదేరారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న సాయికుమార్‌ కారును మితిమీరిన వేగంతో నడిపాడు. చైతన్యపురి కళామందిర్‌ సమీపంలో ముందు వెళుతున్న మరో కారును తప్పించే యత్నంలో.. ఒక్కసారిగా పక్కకు తిప్పాడు.



అతివేగంతో ఉన్న కారు డివైడర్‌కు తగిలి పల్టీలు కొడుతూ.. వేగంగా వెళ్లి మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టే సమయంలో కారు పక్కకు తిరిగి.. దాని ముందుభాగం కాకుండా వెనుకభాగం పిల్లర్‌కు తగలింది. దీంతో కారు వెనుకభాగం నుజ్జునుజ్జు అయి.. ఆ వైపు కూర్చున్న చైతన్య అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదంతో పెద్ద శబ్దం రావటంతో సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్లు, వాహనదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులు, 108కు సమాచారమిచ్చారు. గాయపడిన నలుగురిని బయటకు తీసి సమీపంలోని కొత్తపేట ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సీటు బెల్టు పెట్టుకుని ఉన్న సాయికుమార్‌ ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. అయితే ప్రమాద స్థలంలోని పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గణేశ్‌ (28) అనే యాచకుడి రెండు కాళ్లు విరిగాయి. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



చికిత్స పొందుతూ శ్రీనాథ్‌ మృతి

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్‌ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇక తీవ్రంగా గాయపడిన చక్రపాణి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అతడిని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. కృష్ణ ప్రసాద్‌కు కుడికాలు విరగడంతో సాయిసంజీవని ఆసుపత్రిలో, జైచంద్రారెడ్డి స్వల్ప గాయాలతో ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలిలోనే మృతి చెందిన చైతన్య మన్సూరాబాద్‌ హేమపురి కాలనీలో నివసించే ప్రైవేటు ఉద్యోగి కృష్ణారావు, పద్మ దంపతుల రెండో సంతానం. వారి స్వస్థలం ఏపీలోని గుంటూరు. చైతన్య బీటెక్‌ పూర్తి చేసి గచ్చిబౌలిలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఇక ఆస్పత్రిలో మరణించిన శ్రీనాథ్‌ తండ్రి యాదగిరి డ్రైవర్‌. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురానికి చెందిన వారి కుటుంబం వనస్థలిపురం ద్వారకామయి కాలనీలో నివసిస్తోంది.



మితిమీరిన వేగం వల్లే..

మద్యం మత్తులో కారు నడపడమే కాకుండా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సరూర్‌నగర్‌ సీఐ లింగయ్య తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన సాయికుమార్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నామని... మోటారు వాహనాల చట్టం 304, 185 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.



కారు పల్టీలు కొట్టడం చూశా..

కారు అతివేగంగా వచ్చి పిల్లర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఆర్‌.శ్యామ్‌ తెలిపారు. తాను చైతన్యపురి బస్టాప్‌లో దిగిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగిందని.. కారు పల్టీలు కొట్టడం తాను చూశానని చెప్పారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, వాహనాల్లో వెళ్లేవారు ఆగి గాయపడ్డ వారిని బయటకు తీసి, 108కు సమాచారమిచ్చారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top