వెయ్యి మందికి మెరిట్ స్కాలర్‌షిప్!


ఎస్సీ విద్యార్థుల ఉన్నతికి విద్యాపరంగా మార్పులకు కసరత్తు 

 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖల నివేదికలు

  {పతి జిల్లాలో రెసిడెన్షియల్ 

  డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి

  ఆధునిక వసతులతో హైటెక్ హాస్టళ్లు నిర్మించాలి

  అన్ని టీచర్, వార్డెన్ పోస్టులు 

  భర్తీ చేయాలని సూచనలు

 

 సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు సవాళ్లను అధిగమించి, ఆధునిక పోటీప్రపంచంలో ఇతర విద్యార్థులతో సమానంగా తలపడేందుకు విద్యాపరంగా అనేక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అవసరమైన సలహాలు, సూచనలతో సంబంధిత శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఇందులో భాగంగా స్వల్పకాలిక ప్రణాళికలతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికలను పొందుపరిచాయి. ఇందులో ప్రధానంగా ఎస్సీ విద్యార్థులకు సీఎం టాలెంట్ ఫండ్‌ను అందించాలని సిఫార్సు చేశాయి. షెడ్యూల్‌కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌నేషన్‌లో ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేవరకు ప్రముఖ కాలేజీల్లో చదివేందుకు వీలుగా ఏడాదికి వెయ్యి మందికి చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని సూచించాయి. ఈ స్కాలర్‌షిప్‌లు అందుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఎస్సీలు నివసించే ప్రాంతాల్లో ఏడాదిపాటు సామాజికసేవ చేస్తే స్వదేశంలో లేదా విదేశాల్లో తదుపరి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు ఆర్థికసహాయం పొందేందుకు అర్హులు చేయాలని తమ సిఫార్సుల్లో పేర్కొన్నాయి.

 

 స్వల్పకాలిక ప్రణాళికలో అంశాలివీ...

 ఇంటర్మీడియట్ తర్వాత ఎస్సీ విద్యార్థులకు డిగ్రీ విద్యను అందించేందుకు ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రైవేటు భవనాల్లో ఈ కళాశాలలను ప్రారంభిస్తే వేలాదిమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సీఎం కేసీఆర్ ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ కల సాకారమవుతుంది. మరో రెండేళ్లలో సొంత భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. బయట ఉన్న ఉద్యోగ, ఉపాధి డిమాండ్లను అందిపుచ్చుకునే విధంగా కంప్యూటర్ అప్లికేషన్స్, హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్, డీఈడి, ఇతర వృత్తివిద్యాకోర్సులను అందించాలి.

 

  అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నిర్వహణ ఫండ్‌ను డైట్ చార్జీలుగా మార్చాలి. అన్ని హాస్టల్ సంక్షేమ అధికారుల ఖాళీలను భర్తీచేయాలి. సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపరచాలి.

 

  పాత, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లను కూలగొట్టి వాటి స్థానంలో అన్ని ఆధునిక వసతులతో హైటెక్ హాస్టళ్లను నిర్మించి, సమూల మార్పులు తీసుకురావాలి.

  ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలోని అన్ని టీచర్, వార్డెన్లు పోస్టులను భర్తీచేయాలి. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లేదా  బోధనా నైపుణ్యాన్ని పరీక్షించిన తర్వాత షరతులపై కాంట్రాక్ట్ టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలి

 

 దీర్ఘకాలిక ప్రణాళికల్లో సూచనలివీ...

  హైదరాబాద్, వరంగల్ తదితర నగరాలు, పట్టణాల్లో అన్ని వసతులతో హైటెక్ హాస్టళ్లను ఏర్పాటుచేస్తే షెడ్యూల్ కులాలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.

 

 ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఎలిమెంటరీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి.

  ఏకోపాధ్యాయ పాఠశాలలను డేకేర్ సెంటర్లుగా మార్పు చేయడం ద్వారా స్కూళ్లలో చదవుకునే అవకాశాలను మెరుగుపరచవచ్చు. ఇప్పటికే సెర్ప్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేయాలి.

 

  రెసిడెన్షియల్ స్కూళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేజీ బాలవికాస్, మోడల్ స్కూళ్లను పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం ద్వారా వల్ల వేలాది మంది బాలబాలికలు బాలకార్మికులుగా మారకుండా, బాల్యవివాహాల బారిన పడకుండా నిరోధించే అవకాశం కలుగుతుంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top