మెప్మా..ఇదేంటి చెప్మా?


  • బినామీ గ్రూపులతో రూ.కోట్లు స్వాహా

  •  క్షేత్ర స్థాయిలో కనిపించని గ్రూపులు

  •  మెప్మా, బ్యాంకు సిబ్బంది నిర్వాకం

  •  రహస్యంగా విచారణ చేయిస్తున్న అధికారులు

  • సాక్షి, ఖమ్మం: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో రూ.కోట్లలో గోల్‌మాల్ జరిగింది. బినామీ గ్రూపుల పేరుతో బ్యాంకు లింకేజి తీసుకొని అందినకాడికి స్వాహా చేశారు. లింకేజి తీసుకున్న గ్రూపులు ఎంతకూ చెల్లించకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఓ పది గ్రూపుల లింకేజీపై విచారణ చేయగా.. తీగ లాగితే డొంక కదిలినట్లు అవినీతి బండారం బయటపడింది. ఇందులో ప్రధానంగా మెప్మా అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు బ్యాంకు సిబ్బంది కూడా తోడు కావడం స్వాహా పర్వం కొనసాగింది.

     

    మెప్మా పరిధిలో ఖమ్మం నగరంలో మొత్తం 5,007 గ్రూపులున్నాయి. ఇందులో 39,043 మంది సభ్యులుగా ఉన్నారు. గతంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను  2,266 గ్రూపులకు రూ.45.32 కోట్లు ఇప్పటి వరకు బ్యాంకు లింకేజి మంజూరైంది. తీసుకున్న లింకేజిని సభ్యులు నెలనెలా తమ వాటాగా బ్యాంకులో జమ చేయాలి. అయితే తొలి నాలుగు నెలలు ఎలాంటి అనుమానం రాకుండా చెల్లించారు. ఇందులో కీలకంగా ఉన్న మెప్మా రీసోర్స్ పర్సన్లే ఈ వాటాను చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా మెప్మా సిబ్బంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సుమారు 30కి పైగా బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి కోట్లలోనే స్వాహా చేసినట్లు తెలిసింది.

     

    డొంక కదిలిందిలా..



    బ్యాంకుల్లో ఎంతకూ సొమ్ము జమ కాకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. రుణం తీసుకున్న గ్రూపులు గత కొన్నేళ్లుగా  సొమ్మును ఎందుకు జమచేయడం లేదనే దానిపై విచారణ చేపట్టారు. నగరంలో సుమారు 30 గ్రూపులకు సంబంధించి కోట్లలో బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీనిపై బ్యాంకు అధికారులతోపాటు మెప్మా సిబ్బంది సైతం గత మూడు రోజులుగా నగరంలోని రమణగుట్ట, గాంధీనగర్, రామన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి నగదు చెల్లించాల్సిన గ్రూపుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు చెల్లించని గ్రూపుల వివరాలను ఆయా బ్యాంకుల మేనేజర్లు మెప్మా కార్యాలయంలో అందజేశారు. దీనిపై విచారణ చేసి గ్రూపు సభ్యుల వివరాలతోపాటు ఆయా వ్యక్తుల ఆర్థిక స్థోమత, అసలు వారు ఉన్నారా..? రుణం తీసుకున్నారా..? లేక బినామీలా..? అనే వివరాలను సేకరిస్తున్నారు.

     

    రిసోర్సు పర్సన్లే కీలక పాత్ర..




    మెప్మాలో గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలంటే రీసోర్స్ పర్సన్లదే కీలక పాత్ర. వారు సంతకం చేసిన తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆ తర్వాత జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి సంతకం చేయాలి. దీనిని అవకాశంగా తీసుకున్న రీసోర్స్ పర్సన్లు బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై బినామీ పేర్లతో గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందారు. రుణం మంజూరు సమయంలో మెప్మాలో రీసోర్స్ పర్సన్‌ల నుంచి జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి వరకు మామూళ్లు అందుతాయి. ఏదైనా కొత్త గ్రూపు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అందులో 10 మందిని సభ్యులుగా చేర్చాలి. వారు ఆరునెలలు పొదుపు చేసిన తర్వాత మొదటి బ్యాంకు లింకేజీగా రూ.75 వేలు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. మెప్మాలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై సంఘంలో ఉన్న సభ్యులతోనే మళ్లీ బినామీ పేర్లతో మరో బ్యాంకులో రుణాలు పొందుతున్నారు.

     

    నిబంధనలు బేఖాతరు..



    లింకేజి కింద రుణం ఇవ్వాలంటే బ్యాంకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో గ్రూపు సభ్యులను, వారి వివరాలను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉంటేనే రుణం మంజూరు చేయాలి. అయితే ఇక్కడ అవేమీ పాటించకుండానే కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూపులకు రూ.లక్షల్లో రుణాలు ఇచ్చారు. ఏళ్లు గడవడంతో బ్యాంకు అధికారులు సైతం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. రుణాలు మంజూరు చేసి ఇంతకాలం అయినా తిరిగి చెల్లించకపోవడంతో కొత్తగా వచ్చిన బ్యాంకు అధికారులు రికవరీపై ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో  అసలు ఏం జరిగిందనే దానిపై వారు దృష్టి సారించారు. రుణాలు మంజూరు చేసినప్పుడు ఉన్న రీసోర్స్ పర్సన్‌ల ద్వారా ఈ వివరాలను సేకరించి ఆయా గ్రూపులకు సంబంధించిన సభ్యులను చూపించాలని అడిగారు. వారు గ్రూపుకు ఒకరిద్దరు సభ్యులను మాత్రమే చూపి.. మిగితా వారు లేరని, ఇతర ప్రాంతాలకు వెళ్లారని సమాధానం చెప్పడంతో బ్యాంకు అధికారులకు అనుమానం కలిగింది. నగరంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇలాంటి గ్రూపులు పది ఉన్నట్లు గుర్తించి వాటిపై విచారణ నిర్వహించాలని మెప్మా అధికారులకు ఆ గ్రూపుల లిస్టును అందించారు. దీంతో మూడురోజులుగా నగరంలో విచారణ చేస్తున్న మెప్మా సిబ్బందికి ఆయా గ్రూపుల వ్యక్తులు అసలు లేరనే విషయం తెలిసింది. దీంతో నగరంలో మరిన్ని బినామీ గ్రూపులు ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

     

    నోటీసులు జారీ చేసిన బ్యాంకు అధికారులు



    ఇప్పటి వరకు ఎటువంటి చెల్లింపులు చేయని గ్రూపుల సభ్యులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక గ్రూపులో సభ్యులుగా ఉన్న వారు రుణం పొందిన మేరకు నెలవారీగా చెల్లిస్తున్నారు. అయితే వారిపేరుతోనే మరో లోను ఉందని, దానిని చెల్లించాలనే నోటీసు రావడంతో ఈ బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చింది. నోటీసులు అందుకున్న సభ్యులు బ్యాంకుల వద్దకు వచ్చి తాము తీసుకున్న రుణాన్ని చెల్లిస్తున్నామని, మళ్లీ బకాయిలు ఉండటమేంటని లబోదిబోమంటున్నారు.

     

    విచారణ చేయిస్తున్నాం.. వేణుమనోహర్, పీడీ, మెప్మా



    నగరంలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాం. వివరాలు వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top