రూ.51 కట్టి సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలి

రూ.51 కట్టి సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలి


- ఒక్కొక్కరికి రూ.1.25లక్షల చొప్పున గొర్రెలకు రుణాలు

- గొర్రెల కాపరితో మంత్రి హరీశ్‌ మాటామంతి




సాక్షి, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు కాల్వల పరిశీలనలో భాగంగా పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు గట్టు మండలం ఆరగిద్ద గ్రామం వద్ద గొల్లకుర్మలకు చెందిన పాగుంట అనే వ్యక్తి గొర్రెలను మేపుతూ కాల్వగట్లపై కనిపించాడు. దీంతో వెంటనే మంత్రి హరీశ్‌ తన కాన్వాయ్‌ను ఆపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. ప్రభుత్వం గొల్లకుర్మలకు అందజేస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంపై ఆరా తీశాడు. వారి మధ్య సంభాషణ ఇలా ఆసక్తికరంగా సాగింది..



మంత్రి హరీశ్‌: ఏమయ్యా...నీ పేరేంటీ?

సారూ నాపేరు పాగుంట.

మంత్రి: గొల్లకుర్మలకు ప్రభుత్వం గొర్రెలను అందజేయాలని నిర్ణయించింది నీకు తెలుసా..

పాగుంట: తెలుసు సార్‌.. గ్రామంలో చెప్పారు.

మంత్రి: సహకార సంఘంలో సభ్యత్వం తీసుకున్నావా..

పాగుంట: తీసుకున్న సార్‌.

మంత్రి: ఎన్ని డబ్బులు కట్టావు..

పాగుంట: రూ.300 కట్టాను సార్‌.

మంత్రి: అంత ఎందుకు కట్టావు.. సభ్యత్వానికి కేవలం రూ.51 మాత్రమే ఇవ్వాలి.

పాగుంట: ఏమో సార్‌ మాకు తెల్వదు మా గ్రామంలో అంతనే కట్టించుకున్నారు. కొంత మంది రెండు వేలు కూడా ఇచ్చిండ్రు.

(అప్పుడే పక్కన ఉన్న పొలాల్లోని గొల్లకుర్మలు కూడా హరీశ్‌రావు వద్దకు వచ్చారు.)

మంత్రి: సభ్యత్వానికి మీరెంత చెల్లించారు..?

పాగుంట, ఇతర రైతులు: మేము రూ.300 కట్టాము సార్, మా ఊర్లో, మరి కొన్ని ఊర్లలో 2 వేలు కూడా తీసుకున్నారు.

మంత్రి: ఇలా ఎంత మంది ఇచ్చిండ్రు రెండు రెండువేలు..

పాగుంట, ఇతర గొల్లకుర్మలు: కురుమోల్లందరూ మాకు తెలిసిన వరకు రూ.300 చొప్పున 300 మంది వరకు ఇచ్చినారు. 2 వేల చొప్పున 30 మంది కట్టిండ్రు సార్‌.

మంత్రి దీనిపై వెంటనే కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైనితో మాట్లాడుతూ గొల్లకుర్మల సొసైటీ రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

కలెక్టర్‌: రెండు, మూడు గ్రామాల్లో నిర్వహించాం. అన్ని గ్రామాల్లో నిర్వహిస్తాం సార్‌.

మంత్రి: గొల్లకుర్మలను ఉద్దేశించి ..మీకు వచ్చేది లక్షా 25 వేలు, అందులో బారాన పైసలు మాఫీ, చారానా పైసలు కట్టాలి. అంటే రూ.93 వేలు సబ్సిడీ, రూ.32 వేలు మీరు కట్టాలి.

పాగుంట: గొర్లు ఇచ్చేందుకు ఎంత కట్టాలి సార్‌. ఈ రసీద్‌ సరిపోతదా..

మంత్రి..: రూ.51 కట్టి సభ్యత్వం తీసుకుంటే చాలు. గొర్ల రుణాలు తీసుకునేందుకు అర్హులు.

పాగుంట, గొల్లకుర్మలు: మాకు రూ.40 వేలు అవుతుందని చెప్పారు సార్‌.

మంత్రి: తప్పు.. మీకు తెల్వక మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నరు. రూ.2 వేలు ఎవరూకట్టొద్దు.. సభ్యత్వానికి రూ.51 ఇచ్చి, గొర్లు వచ్చిన తర్వాత రూ.32 వేలు ఇవ్వాలి. అంతే..సరేనా వస్త మరి..

(ఇలా గొల్లకుర్మలతో మాటామంతీ జరిపిన అనంతరం మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top