‘మేడిగడ్డ’ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ

‘మేడిగడ్డ’ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ


కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మం డలం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాలో ఆదివాసీ విద్యార్థి సంఘటన ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భం గా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.  అంతకుముందు సిరొంచాలోని ఇందిరా చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆదివాసీ విద్యార్థి సంఘటన జిల్లా అధ్యక్షుడు, అహేరి మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం బ్యారేజీని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.



బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ-మహారాష్ట్రలో 2,400 హెక్టార్ల ముంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి ముంపు భూములును సర్వే చేయకుండా మహారాష్ట్రలో ఎందుకు సర్వే నిర్వహిస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని 21 గ్రామాల్లో సాగుభూములు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఎలాంటి ముంపు ఉండదని రెండు ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్నాయని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు హరీశ్‌రావు, గిరీశ్ మహజన్‌లు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.



బ్యారేజీ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేశారు. బ్యారేజీని 103, 102, 101 మీటర్ల ఎత్తున నిర్మించడానికి ముంబైలో చీకటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సర్వేను అడుగడుగునా అడ్డుకుని బ్యారేజీని నిర్మించకుండా అడ్డుపడుతామని హెచ్చరించారు. బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందిస్తామని పేర్కొన్నారు. ఆందోళనలో గడ్చిరోలి జిల్లా జెడ్పీ వైస్‌చైర్మన్ అజయ్‌బాబు, జెడ్పీ సభ్యులు కరణ్ రాంపాయ్, శంకర్, సర్పంచులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top