ఔషధం.. విషం..

ఔషధం.. విషం.. - Sakshi


అంగట్లో ఫార్మసీ సర్టిఫికె ట్లు కాలం చెల్లిన మందులు

అర్హత లేకున్నామెడికల్ షాపుల నిర్వహణ




ప్రిస్క్రిప్షన్ లేకున్నా మందులు

జబ్బు విని మందులిస్తూ..

ఔషధ నియంత్రణ

అధికారుల  దాడులు


 జబ్బు నయం కావడానికి మనం తీసుకుంటున్న ఔషధం మాటున ప్రాణహాని ఉందని తెలిస్తే..? మనం వెళ్తున్న మందుల దుకాణాల్లో పలు షాపులకు అనుమతులే లేవంటే..? మనకు మందులిస్తున్న వారికి అసలు ఆ అర్హతే లేదని తెలిస్తే..? ఆ మందులు మనం వాడితే..? పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే వణుకుపుడుతోంది కదూ..? కానీ.. వాస్తవానికి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. కాలం చెల్లిన    మందులనూ మనకు అంటగడుతున్న షాపు యజమానులున్నారు. అనుభవం లేకున్నా షాపులు నిర్వహిస్తున్న వాళ్లున్నారు. జబ్బు విని ఫార్మసిస్టులకు బదులు వర్కర్లే మందు ఇచ్చే దుకాణాలు.. బినామీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న మెడికల్ హాళ్లు జిల్లాలో ఐదొందలకు పైనే ఉన్నాయి. ఈ నెల 3, 4 తేదీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్.. తరువాతి రోజు నిర్మల్, మందమర్రి, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు జరిపిన దాడులతో మెడికల్ హాళ్ల నిర్వహణ విషయంలో ఉన్న అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెడికల్ షాపులు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన 38 మందితో కూడిన అధికార బృందాలు వరుస దాడులు చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 51 షాపులు తనిఖీ చేశారు. రికార్డులు నిర్వహించని వారిని హెచ్చరించారు. మరోపక్క.. ఔషధ నియంత్రణ అధికారులు షాపులు తనిఖీ చేస్తున్న విషయం దావానంలా వ్యాపించడంతో ఆయా పట్టణాల్లో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్న యజమానులు దుకాణాలు మూసేశారు. మరోపక్క.. ఇలాంటి తనిఖీలు ఇకపై నెలలో కనీసం ఒక్క సారైనా నిర్వహిస్తామని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.



 నిబంధనల అతిక్రమణ

జిల్లావ్యాప్తంగా 1100 మెడికల్ షాపులున్నాయి. కేవలం మంచిర్యాల పట్టణంలోనే 300లకు పైగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీల్లో 550 వరకు ఉన్నాయి. మిగతా షాపులు మండల కేంద్రాల్లో ఉన్నాయి. వీటిలో నిబంధనల ప్రకారం కొనసాగుతున్నవి 600లకు మించి ఉండవు. ఫార్మసిస్టు సమక్షంలోనే మెడికల్ షాపులు కొనసాగాల్సి ఉండగా.. చాలా చోట్ల వర్కర్లే షాపులు నిర్వహిస్తున్నారు. ఫార్మసిస్టు సమక్షంలో పలు రకాల మందుల వివరాలు.. అవి వినియోగంపై అవగాహన పెంచుకున్న వర్కర్లతోనే మెడికల్ షాపులు కొనసాగుతున్నాయి. కొన్ని రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వడానికి వీలు లేదు. అయినా.. చాలా చోట్ల ఎవరికి పడితే వారికి  ఆ మందులు అందుతున్నాయి. మందులు వాడిన తర్వాత రోగులు ఇబ్బందులెదుర్కొంటున్న సందర్భాలూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.



జిల్లాలో దాదాపు అన్ని షాపుల్లో రోగుల జబ్బు విని వర్కర్లే మందులివ్వడం షరామామూలైంది. ఇదిలావుంటే.. జిల్లాలో సింహభాగం ఫార్మసీలు బినామీ పేర్లతో కొనసాగడం విశేషం. ఫార్మసీ పట్టా పొందిన కొందరు ఏడాదికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు తమ సర్టిఫికెట్‌ను అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన సర్టిఫికెట్‌ను షాపులో ప్రదర్శించి.. యథేచ్ఛగా ఫార్మసీ నిర్వహిస్తున్నారు. ఇది అధికారులందరికీ తెలిసిన విషయమే అయినా దాడులు చేసి అలాంటి షాపులను సీజ్ చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.



 ఇకపై తరచూ తనిఖీలు..

ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు, బిల్లుల నిర్వహణ.. సర్టిఫికెట్లు.. మందుల నాణ్యత పాటించని మెడికల్ షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటాం. అలాగే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మళ్లీ దాడులు నిర్వహిస్తాం.     - వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top