అసలు పోరు షురూ!

అసలు పోరు షురూ! - Sakshi


అట్టహాసంగా నామినేషన్ల దాఖలు..

కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున కొత్త ప్రభాకర్‌రెడ్డి,  బీజేపీ నుంచి జగ్గారెడ్డి..

ముగిసిన నామినేషన్ల ఘట్టం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక అసలు పోరు షురూ అయ్యింది. అభ్యర్థుల ఎంపిక కాస్త లేటైనా నేతలంతా లేటెస్టుగానే ఎంట్రీ ఇచ్చారు. బుధవారం నామినేషన్లకు చివరి రోజు కావటంతో నేతల హంగు.. ఆర్భాటాలు, మందీమార్బలంతో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మార్పులు.. మలుపులు.. బుజ్జగింపుల తర్వాత టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దించాయి. స్వతంత్రులతో కలుపుకొని మొత్తం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

 

నామినేషన్ వేసిన సునీతారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. ఆమెతో పాటు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. వి. హన్మంతరావు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకే సునీతారెడ్డి నామినేషన్ వేస్తారని ముందుగా ప్రకటించారు. అయితే ఆమె సమర్పించే నాలుగు నామినేషన్ల సెట్లలో ఒక దానికి జగ్గారెడ్డి పేరు పెట్టారు. రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన ఉదయం బీజేపీలో చేరటం, ఆ పార్టీ నుంచి బీఫాం రావడం చకాచకా జరిగిపోయాయి. దీంతో సునీతారెడ్డి నామినేషన్ సెట్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆలస్యంగా నామినేషన్ సమర్పించారు.

 

జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు..

బీజేపీ అభ్యర్థిగా ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) నామినేషన్ వేశారు. జగ్గారెడ్డి ఏం చేసినా సంచలనమే. నిన్నటివరకు డీసీసీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉన్నా.. తెల్లవారేసరికి కషాయం కండువా కప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి. జగ్గారెడ్డి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు.



జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఈ నెల 21న ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్ధన ద్వివేది అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆ ప్రకటనను నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తనకు డీసీసీ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీన్ని పసిగట్టిన బీజేపీ జగ్గారెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు సినీనటుడు పవన్ కల్యాణ్ ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పి జగ్గారెడ్డికి టికెట్ ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.



గులాబీ దండుతో కొత్త ప్రభాకర్‌రెడ్డి...

టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సమర్పించారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. ఉదయం నుంచే గులాబీ దండు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుంది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా గులాబీమయమైంది.

 

ఆ క్షణంలో...

మధ్యాహ్నం 2.12 గంటలు... సునీతారెడ్డి తన నామినేషన్ వేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట మీడియాతో మాట్లాడుతున్నారు. అప్పుడే జగ్గారెడ్డి తన బలగంతో వాహనం దిగారు. ఆయన కలెక్టరేట్ ద్వారం ఎడమ వైపు నిలబడ్డారు. పార్టీ అగ్రనాయకులు ఆయనతో జత కలిశారు. కాగా అదే సమయంలో మంత్రి హరీష్‌రావు తమ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ‘హరీషన్న నాయకత్వం వర్ధిల్లాలి, టీఆర్‌ఎస్  జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.



అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్...జజైై కాంగ్రెస్, సునీతమ్మ నాయకత్వం జిందాబాద్ ’అనే నినాదాలు అందుకున్నారు. ఇక జగ్గారెడ్డి సైన్యం కూడా రెండు వర్గాలకు దీటుగా జైకొట్టారు. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. డీఎస్పీ తిరుపతన్న దళం అటెన్షన్‌లోకి వచ్చింది. మూడు పార్టీల కార్యకర్తలను రోడ్డు మీద వరకు వెళ్లగొట్టారు. ఇక్కడ నాయకులందరూ కలెక్టరేట్ లోకి వెళ్లటంతో నినాదాలు సద్దుమణిగాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top