పది నిమిషాలైతే.. మరో 15మంది బలయ్యేవారే..

పది నిమిషాలైతే..  మరో 15మంది బలయ్యేవారే.. - Sakshi


చలించిపోయిన మాసాయిపేట గ్రామస్తులు

వెల్దుర్తి: మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఉదయం జరిగిన దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ  సంఘటన తూప్రాన్ కాకతీయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరో పది నిముషాల్లో  రైల్వ్ గేట్ అవతల ఉన్న మాసాయిపేట గ్రామంలో విద్యార్థులు బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు పట్టుకోని తల్లిదండ్రుల సహాయంతో 15మంది విద్యార్థులు బస్సు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారిగా రైలు బస్సును ఢీకొట్టడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. అంతలోనే విద్యార్థులు ఉన్న బస్సు బోల్తా కొట్టడం, బస్సులో నుంచి విద్యార్థుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు  భయందోళన గురయ్యారు.



కొంతమంది విద్యార్థులు బస్సులో ఇరుక్కుపోయి ఉండడం చూసి చలించి పోయారు. కాగా, గత ఏడాది తూప్రాన్‌లోని సిద్ధార్థ స్కూల్‌కు చెందిన బస్సు మాసాయిపేట గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయింది. అప్పటికే కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాస్‌నగర్ స్టేషన్ నుంచి రైలు వస్తుండడంతో ఒక్కసారిగా విద్యార్థులు బస్సులో నుంచి కేకలు వేస్తూ దిగుతుండడాన్ని గమనించిన రైలు డ్రైవర్ బ్రేక్ వేయడంతో బస్సుకు 10మీటర్లు దూరం వచ్చి ఆగిపోయింది. దీంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. అప్పట్లో గ్రామానికి చెందిన పలువురు సికింద్రాబాద్‌లోని రైల్వే జీఎంను కలిసి పరిస్థితి వివరించారు. అసంపూర్తి ఉన్న రేల్వే గేటును నిర్మించి ప్రజల ప్రాణాలను రక్షించాలని విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం రైల్వే అధికారులేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top