తోడూ.. నీడ

తోడూ.. నీడ - Sakshi


 ‘‘ఆడది కోరుకునేది రెండే రెండు వరాలు.. చక్కని సంతానం, చల్లని సంసారం’’ అని సినీకవి వర్ణించినట్లుగానే మహిళకు రెండు ప్రపంచాలుంటాయి. పెళ్లికి ముందు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, చదువు, గౌరవ  మర్యాదలు నేర్చుకోవడం.. అదే ప్రపంచం.. పెళ్లి తర్వాత అవన్నింటితోపాటు భర్త, పిల్లలు, అత్తా, మామ, సంసారం, పొదుపు, సమాజంలో హోదా.... ఇవే లోకంగా మారతాయి. కానీ మారుతున్న కాలంతోపాటు  ఆలుమగల పవిత్రబంధంలోనూ మార్పులు వస్తున్నాయి. భార్యాభర్త ఈ బంధంలో ఒదిగిపోయి అన్ని కాలాల్లో ఆదర్శప్రాయంగా జీవనం సాగించాలని శుక్రవారం ‘భార్యల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

 

 నల్లగొండ అర్బన్ : భరించేవాడు భర్త అన్నారు కానీ ఇది భార్యకు సరిగ్గా సరిపోయే ఉపమానంగా చెప్పవచ్చు. కట్టుకున్నవాడు ఎన్ని వేషాలు వేసినా ఓపిగ్గా భరించేది భార్యే. ఎక్కడోపుట్టి, ఎక్కడో చదివి మెట్టినింట అడుగుపెడితే పుట్టింటి ప్రేమను భర్త మరిపించాలి, మురిపించాలి, అర్థం చేసుకోవాలి, ఆదరించాలి, అనారోగ్యంతో భార్య ఒక్క రోజు మంచాన పడితే భర్త అల్లాడిపోతాడు ఎందుకో తెలుసా శ్రీమతి ఆరోగ్యం గురించి కాదు ఆమె చేయాల్సిన పనులు కొన్ని తాను చేయాల్సి వస్తున్నందుకు భార్యను మెప్పించాలంటే బహుమతులు, బంగారమే అక్కర్లేదు. మీరు ఎలా ఉంటే నచ్చరో, ఎలాగుంటే వారి మనసుకు దగ్గరగా ఉంటారో భార్యామణుల మనసు గుర్తెరగాలి.

 

  ఇరువురి భాగస్వామ్యం...

 పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రణాళికా ప్రకారం ముందుకు సాగాలి. చిరుజల్లులుగా ఏర్పడే మనస్పర్థలు తుపానుగా మారి జీవితంలో అనేక సవాళ్లకు దారి తీయవచ్చు. ఇద్దరి మధ్య ఏర్పడే సందేహాల్ని, ఆలోచనలను పంచుకుంటే మేలు, అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ విషయషాల్లోనూ ఇద్దరి భాగస్వామ్యం ఉండాలి. అందుకు భర్తే చొరవ తీసుకోవాలి.

 

 అవమానాన్ని సహించలేరు..

 ఇంట్లో పిల్లల ముందు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నప్పుడు, ఇంటికొచ్చిన బంధువుల ముందు భార్యను చులకన చేస్తూ కొందరు భర్తలు వ్యవహరిస్తుంటారు. పురుష అహంకారానికి నిదర్శనమైన ఇలాంటి వైఖరిని, అవమానాన్ని మహిళలు సహించలేరు. అస్సలు జీర్ణించుకోలేరు. దీనిని మార్చుకోవాలి.

 

 ‘ఆమె’ ఆర్థిక వేత్త...

 చాలామంది మగవారు వారిం ట్లోనే ఉన్న ఆర్థిక వేత్తను గుర్తించలేరు. భార్య ఆలోచనలకు విలువనివ్వరు. భార్యను సలహా అడగడం చిన్నతనంగా కొందరు భర్తలు భావి స్తుంటారు. ఆమె ఆలోచనలు, మెదడు పురుషులకు భిన్నంగా ఉంటుంది. సహజప్రేమ, ఆప్యాయతల్ని ఇష్టపడతారు. వారికి గుర్తింపునిచ్చి సలహాల్ని స్వీకరిస్తే మంచిది.

 

 అవసరం మేరకు స్వేచ్ఛనివ్వాలి...

 ప్రస్తుత ఆధునిక యుగంలోకూడా మహిళ పెళ్లి తర్వాత తాను పుట్టి పెరిగిన కుటుంబం కంటే భర్త, అత్తవారిల్లే ప్రపంచంగా భావి స్తుంది. అయినా ఆమె తల్లిదండ్రులతోనో, బంధువులకో ఫోన్ చేసి మాట్లాడుతుంటే భర్త ఇంట్లోని వారు తట్టుకోలేని దుస్థితి కొన్నిళ్లలో కనిపిస్తుంది. ఇలాంటి వైఖరి విడనాడి  స్వేచ్ఛనివ్వాలి. ఆమెకు ఆ..మాత్రం స్వేచ్ఛనివ్వకపోవడం సరైందికాదు.

 

 యోగక్షేమాలు అడిగితే...


 క్షణం తీరిక లేకుండా ఇంట్లో చేసే పని గురించే కాదు. ఆమె ఆరోగ్యాన్ని కూడా చాలా మంది భర్తలు అంతగా పట్టించుకోరు. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వేడివేడి టీ, కాఫీ చేతికందించే భార్యను ఒక్కసారైనా ఆమె యోగక్షేమాలు అడిగేవారు బహు తక్కువ. ఈ రోజు ఎలా గడిచింది అంటూ పలు విషయాల్ని ప్రేమగా భర్త అడిగితే ఆమె పొంగిపోతుంది.

 

  ఆర్థిక స్వేచ్ఛ...


 ఆర్థికవేత్త కన్నా ఇంటిని నడిపించే మహిళలకు అర్థశాస్త్ర విషయాలు బాగా తెలుస్తాయట. ఇంట్లోకి కావాల్సిన వస్తువుల కొనుగోలు మొదలు ఆస్తులను సమకూర్చుకోవడం వరకు మహిళల సలహాల్ని, సూచనలను పాటించాలి. ఆర్థిక విషయాల్లో స్వేచ్ఛనివ్వడం ద్వారా కుటుంబ ప్రయోజనం కోసం ఎన్నో మేలైన నిర్ణయాలు తీసుకునే సత్తా, సామర్థ్యం ఆమెకుంటాయి.

 

  వీకెండ్‌లతో ఊరట...

 భర్త ఎంతపని ఒత్తిడిలో ఉన్నా భార్యను వారానికోరోజు, వీకెండ్లలోనైనా విహారానికి బయటకు తీసుకెళ్లాలి. కార్యాలయాల్లో విధులు నిర్వహించే నేటి మహిళలు నిత్యం ఎంతో కొంత మానసిక ఒత్తిడికి, సంఘర్షణకు గురవుతుంటారు. వారానికోసారైనా భర్త, పిల్లలతో మనసుకు హాయినిచ్చే ప్రదేశాలకు వెళ్తే.. మానసిక ఒత్తిడి మాయమై కొత్త ఉత్సాహంతో విధులను కొనసాగిస్తారు. ఇంట్లో ఉండేవారికి కూడా తృప్తిగా ఉంటుంది.

 

 ప్రోత్సహిస్తే రెట్టింపు ఉత్సాహం...

 భర్త నుంచి నిరంతర ప్రేమను భార్య కోరుకుంటుంది. తాను చేసే ఏ పనికైనా సహకారాన్ని ఆశిస్తుంది. ఆ పనిని స్వతహాగా చేసుకోగలిగినా, భర్త కూడా అనుమతించి సహకారం అందిస్తే ఆమెలో ఉత్సాహం రెట్టింపవుతుంది. అది ఇంటిపనైనా, మారేదైనా కావచ్చును. భర్త ప్రోత్సాహం ఉంటే ఎంతటి పనినైనా అవలిలగా పూర్తి చేస్తుంది.

 

 వీడినా, కలిసుండేందుకే మొగ్గు...

 భార్యభర్త మధ్య అపోహలు, అనుమానాలు, ఇబ్బందులు, ఘర్షణలుండి విడిపోయినా మళ్లీ కలిసి ఉండటానికే చాలా జంటలు ఇష్టపడుతాయట. ఆ మధ్య అమెరికాకు చెందిన మానసిక నిపుణులు డాక్టర్ చార్ల్స్, స్మిత్ భార్యభర్తల సంబంధాలపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

 

  ఆత్మస్థైర్యంతో నర్సమ్మ జీవన సమరం

 కేతేపల్లి : ప్రమాదశవాత్తు కాలు జారి కిందపడడంతో వెన్నుముక దెబ్బతిని శరీరం చచ్చుబడిపోయిన భర్తకు అన్నీ తానే అయింది  నర్సమ్మ. చంటి పిల్లాడిలా అతని ఆలనాపాలనా చూసుకుంటోంది. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పడాల నాగయ్య-నర్సమ్మలది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ పిల్లలతో హాయిగా గడిపేవారు. 2009 ఏప్రిల్ నెలలో నాగయ్య రబీ వరిపంట నూర్పిళ్ల కోసం గోనె పట్టాలను నెత్తిన పెట్టుకుని పొలం గట్టు మీదుగా నడుస్తుండగా కాలుజారి వెనక్కు పడిపోయాడు. ఈ ప్రమాదంలో నాగయ్య వెనుక వైపు మెడ కింద భాగంలో వెన్నెముక దెబ్బతింది. శరీరం మొత్తం స్పర్శ లేకుండా జీవచ్ఛవంలా మారిపోయాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది.కుటుంబభారం భార్య నర్సమ్మపై పడింది. కూలి పనులకు వెళ్లి ఇద్దరు కుమారులు, కుమార్తెతోపాటు భర్తను కూడా చంటి పిల్లాడిలా సాకుతోంది.

 

 భర్తకు అన్నీ తానై..

 దామరచర్ల : విద్యుదాఘాతంతో మంచానపడిన భర్తకు చంటిపిల్లాడికి మాదిరి సేవలు చేస్తూ కూలి పనికి వెళ్లి ఇద్దరు పిల్లలను పోషిస్తున్న ఓ మహిళ  దీనగాథ ఇది. దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానిక చెందిన కుర్ర సైదులు గొర్రెలకాపరి. భార్యభర్తలిద్దరూ పనిచేసుకుంటూ పిల్లలో హాయిగా జీవనం సాగిస్తున్నారు. పదినెలల క్రితం గొర్రెపిల్లలకు మండకొడుతుండగా విద్యుదాఘాతానికి గురై రెండుకాళ్లు ముద్దలుగా మారి మొండాలయ్యాయి. ఒకచేయిని తొలగించారు. కూర్చున్న కానుంచి కదలలేడు. పనిచేయలేడు. దీంతో కుటుంబభారం భార్య కుర్ర నాగేంద్రమ్మపై పడింది. అయినా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఓ వైపు కూలినాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్తకు సకల సపర్యలు చేస్తుంది. భర్తను కంటికి రెప్పలా కాపాడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top