మావోయిస్టుల మహాసభకు ఏర్పాట్లు?

మావోయిస్టుల మహాసభకు ఏర్పాట్లు? - Sakshi


అఖిల భారత సదస్సు నిర్వహణకు పార్టీ నిర్ణయం

బీహార్-జార్ఖండ్ మధ్యనున్న దండకారణ్యమే వేదిక




* అబూజ్‌మడ్ కోటలో 20 వేల మంది మావోయిస్టులు?

* కేంద్ర నిఘా వర్గాలకు అందిన సమాచారం

* దండకారణ్యంపై దాడికి 10 వేల మందితో బలగాలు సిద్ధం


 

సాక్షి, ఖమ్మం: అఖిల భారత స్థాయి సమావేశానికి మావోయిస్టు పార్టీ సిద్ధమైందా? రెండేళ్ల క్రితం వాయిదా పడిన పార్టీ ఆలిండియా పదో కాంగ్రెస్‌ను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని మావోయిస్టులు భావిస్తున్నారా? బీహార్-జార్ఖం డ్ మధ్యనున్న దండకారణ్యమే ఇందుకు వేదిక కానుందా? అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. అఖిల భారత సదస్సుకు మావోయిస్టు అగ్ర నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆ వర్గాల సమాచారం. గతంలోనూ దండకారణ్యంలోనే ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ రక్షణ బలగాల ఒత్తిడి అధికంగా ఉండడం, ఏదైనా దాడి జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుందన్న కారణాలతో మావోయిస్టులు దాన్ని విరమించుకున్నారు.

 

పీపుల్స్‌వార్, ఎంసీసీఐలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి ఆదివారం(ఈ నెల 21)తో పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన కీలక సమావేశాల్లో మళ్లీ అఖిల భారత సదస్సును నిర్వహించాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశాలోని మల్కన్‌గిరి, విశాఖపట్నం మధ్యలో కీలక సమావేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారని సమాచారం. వారోత్సవాల నిర్వహణ, జనతన సర్కార్ (మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం) పనితీరు, గిరిజన ప్రాంతాలపై పట్టు కొనసాగింపు, దుర్బేధ్యమైన అబూజ్‌మడ్‌లో సాయుధ బలగాల పెంపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

 

సదస్సుకు రక్షణగా ఏడంచెల వ్యవస్థ

ఆలిండియా కాంగ్రెస్‌ను మావోయిస్టు పార్టీ చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఏడంచెల భద్రతను ఏర్పాటు చేసుకుంటుంది. వీటిని దాటుకుని సదస్సు జరిగే చోటుకు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ కోటలో దాదాపు 20 వేల మంది సాయుధులు ఉన్నట్లు సమాచారం. కోట చుట్టూ ఉన్న దంతెవాడ, బీజాపూర్, బస్తర్, సుకుమా, కొండగావ్ ప్రాంతాల్లో జనతన సర్కార్‌లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. బస్తర్ ప్రాంతంలో కొంత పట్టు తప్పినా మిగిలిన చోట్ల కమిటీలు చురుగ్గానే ఉన్నాయని మావోయిస్టు పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో మరింత పట్టు సాధించాలనే కోణం లో పావులు కదుపుతోంది.

 

అందులో భాగంగా ఇప్పటివరకు విల్లంబులు ధరించి పోరాడుతోన్న భూంకాల్ మిలీషియా సభ్యులకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అబూజ్‌మడ్‌లోని దళాలకు కిషన్‌జీ తమ్ముడు వేణుగోపాల్ సారథ్యం వహిస్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీలకు రామన్న నేతృత్వం వహిస్తున్నారు. సమీప గ్రామాల్లోని జనతన సర్కార్ కమిటీలను పరిపుష్టం చేసుకోవడం, గ్రామ కమిటీల ద్వారా శ్రమదానం, పాఠశాలల నిర్వహణ, మెడికల్ క్యాంపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది.

 

మరోవైపు మావోయిస్టులపై అదను చూసి దాడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేస్తోంది. సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలకు చెందిన 10 వేల మందిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

కేంద్ర కమిటీ కొత్త సభ్యులెవరు?

సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు నాయకత్వం తమ కార్యకలాపాలతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల వివరాలను కూడా అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  కేంద్రంలో ఎన్డీయే సర్కారు రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  తీవ్రంగా దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో ఈ పంథాను ఎంచుకుంది. పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహించే కేంద్ర కమిటీ సభ్యుల వివరాలను రహస్యంగా ఉంచడమే మేలని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొత్తగా కేంద్ర కమిటీలోకి తీసుకున్న ఎనిమిది మంది మావోయిస్టు నాయకుల వివరాలను బహిర్గతం చేయడం లేదు. మూడేళ్లుగా కేంద్ర కమిటీలో 17 మంది వరకు సభ్యులు ఉన్నారు.

 

వీరిలో 14 మంది తెలుగు వారే. గత పదేళ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో చాలా మంది పార్టీ అగ్రనేతలు మృతి చెందారు. ఏకంగా కొన్ని దళాలే కనుమరుగయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ మరణం మావోయిస్టు పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగించడమే గగనమైపోయింది. అయితే ఇక్కడ తిరిగి పట్టు సాధించడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కేంద్ర కమిటీ సభ్యుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top