దమ్ముంటే ఓసారి ఓయూకు రా..!

దమ్ముంటే ఓసారి ఓయూకు రా..! - Sakshi


కేసీఆర్‌కు మందకృష్ణమాదిగ సవాల్



 హైదరాబాద్: తాను మొండోడినని, ఎవరికీ భయపడనని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ దమ్ముంటే తన భద్రతా సిబ్బందితోనైనా సరే ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సవాల్ విసిరారు. యూనివర్సిటీలకు అంత స్థలం ఎందుకని, అవేమన్న రాజదర్భార్లా, విద్యార్థులు మెచ్యూరిటీలేని పోరగండ్లని అనడం కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



1000 ఎకరాల కేబీఆర్ పార్క్‌లోని 80 శాతం స్థలంలోనూ, ఖాళీ అవుతున్న హుస్సేన్‌సాగర్ చుట్టూ పేదలకు ఆరంతస్తుల మేడలు నిర్మించవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓయూ విద్యార్థులకు, నగర ప్రజలకు నడుమ సీఎం వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఓయూలో 11 ఎకరాలు కాదు కదా.. 11 ఇంచుల స్థలాన్ని కూడా వదులుకునేందుకు విద్యార్థులు సిద్ధంగా లేరన్నారు. విద్యార్థుల ఆందోళనలకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ కార్యకర్తల అండ ఉంటుందన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి నేతలు రుద్రవరం లింగస్వామిమాదిగ, అశోక్‌యాదవ్, హబీబ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top