అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తా..

అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తా..


మంచిర్యాల టౌన్ : ‘దాదాపు పదేళ్లుగా నివాసం ఉంటున్నం. మా కాలనీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. రాత్రివేళ దోమల బాధ తీవ్రమై నిద్ర కూడా పట్టడం లేదు. శివారు కాలనీల్లో మురికి కాలువల నిర్మాణాలు లేక.. మురికి గుంతల నుంచి వెలువడే దుర్వాసన భరించలేకపోతున్నం. మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలి, ఇళ్లస్థలాలు ఇప్పించాలి. మరుగుదొడ్ల నిర్మాణాలు, బిల్లులు మంజూరు చేయించాలె..’ అంటూ మంచిర్యాల మున్సిపాల్టీ పరిధిలోని తిలక్‌నగర్, వికలాంగుల కాలనీ ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.



పట్టణ ప్రజలసమస్యలు తెలుసుకోవడం కోసం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆయా కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై హామీలిస్తూ.. మరికొన్నింటిపై అప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తానని, కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు.



నడిపెల్లి దివాకర్‌రావు : అందరికీ నమస్కారాలు.. అందరూ బాగున్నారా..

 ప్రజలు : బాగున్నాం సారూ.. మీరు బాగున్నారా..

 దివాకర్‌రావు : మీరు బాగుంటే.. మేమూ బాగున్నట్టే..

 దివాకర్‌రావు : ఏంటి..? లక్ష్మి బాగున్నావా..

 చెన్నూరి లక్ష్మి : బాగున్నా సారూ..

 దివాకర్‌రావు : ఏమిటీ నీరసంగా ఉన్నావు.. పింఛన్ వచ్చిందా..?

 చెన్నూరి లక్ష్మి : ఏమి లేదు సారూ, బాగానే ఉన్నా. రెండు నెలల పింఛన్ రూ.2 వేలు అచ్చింది.

 దివాకర్‌రావు : మరీ బట్టలు కొన్నావా లేదా..?

 చెన్నూరి లక్ష్మి : బట్టలు కొంటే తిండి ఎట్లా సారూ.

 దివాకర్‌రావు : వాడ ఎట్టుంది. ఏం సమస్యలు ఉన్నాయి..

 చెన్నూరి లక్ష్మి : వాడ బాగుంది సారూ... కానీ ఇంకా రోడ్లు కావాలి అలాగే లాట్రీన్‌లు కావాలి.

 దివాకర్‌రావు : మరుగుదొడ్ల సమస్య త్వరలోనే తీరుతుంది. గతంలో ఎలా ఉండే ఇప్పడు అభివృద్ధి ఎలా ఉంది.

 చెన్నూరి లక్ష్మి : అన్ని సమస్యలు తీరుస్తున్నారు. గతంలో కంటే ఇప్పడు బాగానే ఉంది.

 దివాకర్‌రావు : మీరు చెప్పండి పింఛన్లు అందరికీ వస్తున్నాయా..

 ఎర్రోజు చంద్రమౌళి : నా భార్యకు వత్తలేదు.. నాకు మొన్నటిదాకా అచ్చింది. ఇప్పడేమో ఆపిండ్రు. ఏడేళ్ల పట్టి తీసుకుంటున్న, అయినా ఇప్పడు ఎందుకు ఆపారో తెలుత్తలేదు సారూ..

 దివాకర్‌రావు : (పత్రాలు అన్నీ పరిశీలించి) పర్వాలేదు... పింఛన్‌కు అర్హుడివే, పింఛన్ వచ్చేలా చూస్తాను.

 ఆసంపల్లి వెంకటేశ్ : సార్... మాకు పట్టాలు కావాలి, నల్లాలు కావాలి(అంధ వికలాంగుడు)

 దివాకర్‌రావు : వెంకటేశ్ బాగున్నావా... నీ భార్య చంద్రకళ(కాళ్లు లేవు) ఎలాగుంది.. ఇప్పుడేం చేస్తున్నారు, మీ ఇద్దరికీ పింఛన్ వచ్చిందా..?

 ఆసంపల్లి వెంకటేశ్ : కూరగాయలు అమ్ముకుంటున్నాం సారూ... పింఛన్ కూడా ఇద్దరికీ కలిపి రూ.మూడు వేలు వచ్చింది.

 దివాకర్‌రావు : మరీ కాలనీలో క్వార్టర్ ఉందా..?

 ఆసంపల్లి వెంకటేశ్ : క్వార్టర్ ఇచ్చిండ్రు, కానీ పట్టాలు ఉంటే నల్లా కనక్షన్ ఇస్తారంటూ.. అప్పు చేసి మరుగుదొడ్డి కట్టుకున్నం. డబ్బులు రాలేదు.

 దివాకర్‌రావు : అధికారులతో మాట్లాడి పట్టాలు అందించే ఏర్పాటు చేస్తా. పట్టా అందగానే ఇదిగో ఈ మీ చైర్మనమ్మ(చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధరను చూపిస్తూ) నల్లా కనెక్షన్ ఇప్పిస్తది, బిల్లులు కూడా వస్తాయి...(అంతా నవ్వులతో చప్పట్లు)

 పసునూటి భీమక్క : సారూ.. తిలక్‌నగర్‌లో కిరాయికి ఉంటున్నం. అయితే రాజీవ్‌నగర్‌లో స్థలం ఇచ్చారు. కానీ హౌసింగ్ సారు బిల్లు రాదంటున్నరు. ఏం చేయాలి..?

 దివాకర్‌రావు : (కౌన్సిలర్ దెబ్బట శ్రీనివాస్‌తో మాట్లాడి...) ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాలేదంటా. అధికారులతో మా ట్లాడి వివరాలు తెలుసుకుని పట్టాలు ఇప్పించి, నిర్మాణాని కి సంబంధించి బిల్లులు కూడా ఇప్పించేలా ఏర్పాటు చేస్తా.

 దివాకర్‌రావు : ఏమ్మా... పెన్షన్ వస్తుందా..?

 తాహెరాబేగం : లేదు సారూ... పింఛన్ వస్తలేదు. ఇక్కడ నాన్న దగ్గర ఉంటున్నా. రెండు సార్లు దరఖాస్తు చేసిన పేరు లేదంటున్నరు.

 దివాకర్‌రావు : ఇంతకు ముందు తీసుకున్నావా..?

 తాహెరాబేగం : లేదు, కొత్తగా దరఖాస్తు చేశా.

 దివాకర్‌రావు : (కౌన్సిలర్‌తో మాట్లాడి...) పెన్షన్ వచ్చేలా చూస్తానమ్మా...

 దివాకర్‌రావు : ఏం... సత్తయ్య బాగున్నావా..? తిలక్‌నగర్ వార్డు ఎలా ఉంది..?

 ఆకుల సత్తయ్య : బాగున్నా సార్.. పదేళ్లకు పైగా ఉన్న సమస్యలు తీరుతున్నాయి సార్.

 దివాకర్‌రావు : ఇంకా ఇక్కడ ఏం సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి..?

 ఆకుల సత్తయ్య : మరుగుదొడ్లు, శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయి సర్..

 దివాకర్‌రావు : మరుగుదొడ్ల బిల్లుల సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లుతా... శ్మశాన వాటికలో బోరు వేయించా కదా సత్తయ్య...

 ఆకుల సత్తయ్య : బోర్ ఉన్నా కానీ మోటర్ కావాలి, శ్మశాన వాటిక స్థలానికి చుట్టూ కంచె వేయాలి.

 దివాకర్‌రావు : (మున్సిపల్ అధికారులతో మాట్లాడి చెబుతాననే లోపు) చైర్మనమ్మ ఇక్కడే ఉంది. సమస్య తీరేలా మాట్లాడి కంచే ఏర్పాటుకు కృషి చేస్తాం.

 దివాకర్‌రావు : ఏం సంగతులమ్మా ఏంటీ అంతా బాగున్నారా..?

 జరీనా : అంతా బాగున్నాం సారూ...

 దివాకర్‌రావు : నన్ను చూసి అంతా బాగున్నామని అంటున్నారా (అనగానే అంతా నవ్వులు)..!

 జరీనా : పింఛన్లు అందరికీ అత్తున్నాయ్ సారూ... మీరు అచ్చినాకా అందరికి అన్నీ అందుతున్నాయి సారూ.. పింఛన్లు రానోళ్లు దరఖాస్తు చేసిండ్రు జర వాళ్లకి అచ్చేలా చూడాలి సారూ..

 దివాకర్‌రావు : అర్హులైన అందరికీ ఆసరా పెన్షన్‌లు అందుతాయి. ఒకటికి రెండు సార్లు పరిశీలించి అందరికీ వచ్చేలా చూస్తామమ్మా..

 ముడుసు లక్ష్మణ్ : సార్.. 1999లో వికలాంగుల కాలనీలో ఇళ్లు పంపిణీ చేశారు. అప్పటి నుంచి మరుగుదొడ్లు, నీటి కుళాయి కనెక్షన్లు, రోడ్లు, కాలువలు ఇలా అన్ని సమస్యలపై కలెక్టర్, ఆర్డీవో, ప్రజాప్రతినిధులు వస్తున్నారు. చూస్తున్నారు కానీ ఇంకా సమస్యలు తీరడం లేదు.

 దివాకర్‌రావు : రోడ్లు, కాలువలు పూర్తయ్యాయి కదా...

 ముడుసు లక్ష్మణ్ : మరుగుదొడ్ల బిల్లులు రాక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ఇక పట్టాలు ఉంటేనే నల్లా కనెక్షన్లు ఇస్తామంటున్నారు. అందరికీ పట్టాలు రాలేదు. ఏం చేయాలి..?

 దివాకర్‌రావు : పట్టాల కోసం తహశీల్దార్‌తో మాట్లాడి వెంటనే ఆ సమస్య తీరేలా చూస్తాను.

 దివాకర్‌రావు : అందరూ బాగున్నారా..? పనికి పోతున్నారా..?

 ప్రజలు : బాగున్నాం సారూ... అంతా పత్తి ఏరడానికి, కూలీ పనికి పోతున్నాం సారూ..

 మహిళలు : మొగుళ్ల పంపాదన గుడుంబా పాలవుతంది.. మా సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతన్నయి.

 దివాకర్‌రావు : గుడుంబా అమ్మకాలను వెంటనే ఆపేలా ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా.

 మహిళలు : అవును సారూ.. గుడుంబా అమ్మకుండా చూడండి.. మీ రుణం తీర్చుకుంటం సారూ..

 దివాకర్‌రావు : డ్వాక్రా రుణాలు వస్తున్నాయా..?

 మహిళలు : వస్తున్నాయి సార్... వడ్డీ లేని రుణం ఇప్పించేలా చూడండి సార్

 దివాకర్‌రావు : ఇది వరకే వచ్చిన రుణాలతో ఏం చేస్తున్నారు..?

 మహిళలు : దుకాణాలు నడిపిస్తున్నాం, కుట్టు మిషన్లు కొన్నాం.. సార్.. వాటితోనే కుటుంబం గడుపుతున్నాం. గిప్పుడు రూ.పది లక్షల రుణం కోసం ఎదురు చూస్తాన్నాం సార్..

 దివాకర్‌రావు : రుణం పొంది డబ్బులు వృథా చేయకుండా వ్యాపారం నిర్వహించి ఆర్థికంగా ఎదగాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top