సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి

సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి - Sakshi


భట్టి విక్రమార్క డిమాండ్

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పీసీసీ నేతలు తూర్పు జగ్గారెడ్డి, బండి సుధాకర్‌తో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. రెండున్నరేళ్లలో ఎస్సీలకు, ఎస్టీలకు వినియోగించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలను కావాలని విస్మరిస్తున్నారని, అంబేడ్కర్ అడుగుజాడల్లో హక్కుల కోసం పోరాడుతా మని హెచ్చరించారు.



ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో పోరాడి, ఉద్యమించిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క కార్యాలయా న్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విమలక్కను పోలీసులతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ముమ్మాటికీ పౌరహక్కుల ఉల్లంఘన, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీఆర్‌ఎస్ నేతలు అనవసరమైన నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ భయపడుతున్నదని, టీఆర్‌ఎస్‌ను వెంటిలేటర్ పైకి పంపించే శక్తి కేవలం కాంగ్రెస్‌కే ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top