ప్రజా అనుమతితోనే మల్లన్నసాగర్

ప్రజా అనుమతితోనే మల్లన్నసాగర్ - Sakshi


‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

దేశంలో అతితక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టు ఇదే

నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. రైతులకు నష్టం చేయబోం

అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే విపక్షాల ఆందోళన

సీపీఎం, బయటి శక్తుల వల్లే హింసాత్మక ఘటనలని ఆరోపణ




హైదరాబాద్: రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి రెండు పంటలకు నీరందించేందుకే ప్రభుత్వం ‘ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్’ను చేపట్టిందని.. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. మల్లన్నసాగర్‌ను దేశంలోనే అతి తక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టుగా పేర్కొన్న మంత్రి... ముంపు ప్రజల అనుమానాలను నివృత్తి చేసి, వారి అనుమతితోనే ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ విషయంలో విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.


ప్రశ్న: ప్రాణహిత-చేవెళ్ల రీ ఇంజనీరింగ్‌తో సమస్య మొదలైనట్లుంది?

హరీశ్‌రావు: గోదావరిలో తెలంగాణ వాటా 954 టీంఎసీలు.. కానీ ఏనాడూ ఈ వాటాను వాడుకోలేకపోయింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు పోగా.. మిగతా 110 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. అందువల్లే వీలైనన్ని ఎక్కువ నీళ్లను వినియోగించుకునేలా రీ ఇంజనీరింగ్ చేపట్టాం.




50 టీఎంసీల రిజర్వాయర్ అవసరమా అనే ప్రశ్నకు మీ సమాధానం?

లక్షలాది ఎకరాలకు నీరు ఇవ్వాలంటే భారీ రిజర్వాయర్లు కట్టాలి. 45 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టు కోసం 28 గ్రామాలు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 19 గ్రామాలు, మిడ్‌మానేరులో 25 టీఎంసీలకు 18 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలకు 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయనే విషయాన్ని గమనించాలి.




ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి కదా!

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. ప్రజల్లో అపోహలు కల్పించి, సమస్యలు సృష్టించి ప్రాజెక్టుల వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే ఆరు గ్రామాలతో చర్చలు పూర్తయ్యాయి. మూడు గ్రామాలు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. నిర్వాసితులను ఒప్పించి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప బలవంతం చేయడం లేదు.


ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై..?

సంక్షేమ కార్యక్రమాలు చేపడితే దుబారా అంటారు, ప్రాజెక్టులు చేపడితే అవినీతి అంటారు. భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ఒత్తిడి చేస్తున్న టీడీపీ... ఇక్కడ అమలు చేయాలంటూ ధర్నాలు చేస్తోంది. ఆ పార్టీకి ఓ నాయకుడు, ఓ వైఖరీ లేదు. ఇదే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు పంటలు పండే భూములను లాక్కుంటున్నది. రాజధానికి 54 వేల ఎకరాలు తీసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించడం టీడీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.


పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మక ఘటనలపై మీ వివరణ?

సీపీఎం, బయటి నుంచి వచ్చిన శక్తులు రైతుల ఆందోళనను హింసాత్మకంగా మార్చాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే సంయమనం పాటించి అమాయక రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా.. విద్రోహ శక్తులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.




మల్లన్నసాగర్‌పై అంత పట్టుదల ఎందుకు?

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి 1,300 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణకు హక్కు ఉన్నా.. అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. మేం అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యత, నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను చేపట్టాం. మల్లన్నసాగర్ ద్వారా మెదక్ జిల్లాలో 9 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 2.30 లక్షల ఎకరాలకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణ ద్వారా 2.50లక్షల ఎకరాలకు నీరందిస్తాం. తక్కువ ముంపుతో పెద్ద రిజర్వాయర్ నిర్మించే అవకాశం మల్లన్నసాగర్ వద్దే ఉంది.




పరిహారంపై వస్తున్న విమర్శలకు మీ స్పందన?

మల్లన్నసాగర్ విషయంలో బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందిస్తాం. రాళ్లు, రప్పలున్నా ఎకరాకు రూ.ఆరు లక్షలతోపాటు బోరు, బావి, చెట్లకు కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. భూసేకరణ చట్టం-2013 కంటే జీవో 123 ఏవిధంగా మెరుగైందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇంగ్లిషు మీడియంలో రెసిడెన్షియల్ విద్య, కులవృత్తుల వారికి 80శాతం సబ్సిడీతో పథకాలు, చేపలు పట్టే అధికారం తదిత ర ప్రయోజనాలు చేకూరుస్తాం. అన్ని వసతులతో పునరావాస గ్రామాలు నిర్మిస్తాం.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top