నిలవాలి.. గెలవాలి

నిలవాలి.. గెలవాలి - Sakshi


తెలంగాణను బీజేపీకి కంచుకోటగా మార్చాలన్న అమిత్ షా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణనే కీలకం

దక్షిణ, తూర్పు రాష్ట్రాల అండతోనే పార్టీకి మళ్లీ అధికారం

తెలంగాణలో ఇంటింటికీ పార్టీ నినాదం చేరాలి.. ప్రతి కార్యకర్తా  శ్రమించాలి.. తెలంగాణ విమోచన దినం నుంచే సంకల్పించాలి

గ్రేటర్ ఎన్నికలతో విజయాలను మొదలుపెడదాం

తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రాష్ర్ట విభజన

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అండగా ఉంటామన్న అమిత్ షా

రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రాక


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా ఎదగాలని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అభిలషించారు. ఇందుకు ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల తర్వాత కేంద్రంలో బీజేపీ మరోసారి కొలువుదీరేందుకు దక్షిణాదిలో పార్టీ అద్భుత విజయాలు సాధించాలని, అందుకు తెలంగాణ నేతృత్వం వహించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఆ రోజును ఆలంబనగా చేసుకుని ఊరూరా, వాడవాడలా బీజేపీ నినాదం ఇంటింటికీ చేరుకోవాలి. ఆ మేరకు పార్టీ శ్రేణులు సంకల్పం చేసుకోవాలి. ఈసారి తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ సంకల్ప్ దివస్‌గా జరుపుకోవాలి’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచనం పేర ఆనాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించిన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని నిర్దేశించారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలంగాణతోనే రాష్ట్రాల పర్యటన కార్యక్రమం మొదలుపెడుతూ అమిత్ షా గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శాఖ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రే ణులను ఉత్సాహపరుస్తూ అమిత్ షా ప్రసంగించారు. ఇటీవలి ఎన్నికల్లో దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో అద్భుత విజయంతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, కానీ వచ్చే దఫా మాత్రం దక్షిణం, తూర్పు ప్రాంతాల్లో అఖండ విజయంతో అధికారంలోకి రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందులో తెలంగాణ పాత్ర కీలకంగా ఉండాలని, బీజేపీకి కంచుకోట కావాలని తన లాంటి పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇది సాధ్యం కావాలంటే పార్టీ కార్యకర్తలు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం నగరాల నుంచి పల్లెల వరకు, పక్కా ఇళ్ల నుంచి పూరి గుడిసెల వరకు అన్ని చోట్లకు పార్టీ ముమ్మరంగా చేరుకోవాల్సిన అవ సరం ఉందని పేర్కొన్నారు. దేశం మొత్తాన్ని ఐక్యం చేసే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికలో విజయాన్ని అలవాటు చేసుకోవాలని, వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో దీన్ని అమలు చేయాలని దిశా నిర్దేశం చేశారు.

 

 తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ చిచ్చు

 ‘గతంలో వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు ప్రాంతాల్లో ప్రజలు పరస్పరం మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కానీ అన్నింటినీ రాజకీయ లబ్ధి కోణంతో చూసే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనలోనూ అదే పంథాను అనుసరించి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టింది. ఆ పార్టీ నిర్వాకం వల్ల రాష్ట్ర విభజన జరగాల్సిన పద్ధతిలో జరగక ప్రజల మధ్య అగాధం ఏర్పడింది’ అని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేందుకు ప్రప్రథమంగా తీర్మానం చేసిన ఘనత బీజేపీదేనని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం ద్వారా దేశ పురోగతికి తోడ్పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు సాగితే వారికి బీజేపీ పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాబాద్‌కు వ చ్చినప్పుడు పార్టీ దివంగత నేతలు బంగారు లక్ష్మణ్, టైగర్ నరేంద్రలను స్మరించుకోకుండా ఉండలేనని, తెలంగాణను సాధించుకునే క్రమంలో అసువులుబాసిన వందలాది అమరులకు జోహార్లర్పిస్తున్నట్లు తెలిపారు.

 

 ప్రజల మధ్య ఎదిగిన నేత మోడీ

 ప్రధాని నరేంద్ర మోడీ అతి సాధారణ వ్యక్తిగా ప్రజల మధ్యే ఎదిగిన నేత అని అమిత్‌షా కొనియాడారు. గుజరాత్‌లో నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని, కృషి, పట్టుదలే ఆయనను ఈ స్థాయికి చేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ తొలిసారి సంపూర్ణ బలంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది మోడీ కృషేనని అభినందించారు. ఇది ప్రతి బీజేపీ కార్యకర్త గర్వపడే విషయమన్నారు. ఇటీవలి పంద్రాగస్టు వేడుకలో ఎర్రకోటపై మోడీ ఉపన్యాసాన్ని ప్రతి కార్యకర్త మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి పునరంకితమయ్యేలా ఆయన చేసిన సూచనలు అనుసరించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గంలో ఓ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని ప్రధాని లక్ష్యం విధించారని, ఎర్రకోట మీద గ్రామ ప్రగతి గురించి మాట్లాడిన గొప్ర ప్రధాని మోడీ అని చెప్పుకొచ్చారు. అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరొందిన గత యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఆ ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాల జాబితా చెబుతూ పోతే భాగవతసప్తాహం మాదిరి కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. అబద్ధపు, ఆచరణ సాధ్యం కాని హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. తమ ప్రతి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని, వాటిని నెరవేర్చి వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లడుగుతామని స్పష్టంచేశారు. వంద రోజుల్లో ధరలను నియంత్రిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంలోనూ ధరలను ఎందుకు నియంత్రించలేకపోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్వార ్థం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని, లేకపోతే కాంగ్రెస్‌ను ప్రస్తుత స్థాయి నుంచి కూడా జనం పీకి పడేస్తారని హెచ్చరించారు.

 

 ఏ దేశాన్నీ భయపెట్టం.. ఎవరికీ భయపడం

 ఈ సందర్భంగా పాక్ వ్యవహారాన్ని కూడా అమిత్ షా ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు స్నేహహస్తం అందించేందుకు మోడీ ప్రయత్నిస్తుంటే.. ఆ దేశం మాత్రం కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. కానీ భారత్‌లో మోడీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని ఆ దేశం గుర్తించాలని హెచ్చరించారు. పాక్ చర్యలతో విదేశీ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. వైశాల్య పరంగా పెద్దగా ఉన్నామని ఏ దేశాన్నీ భయపెట్టబోమని, అలాగని ఎలాంటి దేశానికీ భయపడబోమని తేల్చిచెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 90 రోజుల్లో మోడీ ప్రభుత్వం.. వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధికి సంబంధించిన రోడ్డుమ్యాప్‌ను సిద్ధం చేసిందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top