అంతర్రాష్ట్ర వాణిజ్యం బంపర్‌!

అంతర్రాష్ట్ర వాణిజ్యం బంపర్‌!


రాష్ట్రం నుంచి భారీగా వస్తుసేవల ఎగుమతులు

జీఎస్టీ వసూళ్ల లెక్కలతో స్పష్టత




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వస్తుసేవలు భారీగా ఎగుమతి అవుతున్నాయి. పంట ఉత్పత్తులు, ఫార్మా, గ్రానైట్, ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతుల లావాదేవీలు గణనీయ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి వస్తువుల రవాణా, ఎగుమతుల ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ) వసూలు కానుందని లెక్కతేలింది. జీఎస్టీ ప్రారంభమైన జూలై, ఆగస్టు నెలల్లో కలిపి రూ.1,101 కోట్లు వసూలైంది. అయితే జీఎస్టీ పన్ను పూర్తిగా వినియోగ ఆధారిత పన్ను విధానం కాబట్టి.. అంతిమంగా ఈ వస్తువులు, సేవలను వినియోగించే రాష్ట్రాలకే ఈ పన్ను సొమ్ము చేరుతుంది.



రాష్ట్రం కీలకపాత్ర

సాధారణంగా ఉత్పత్తి, తయారీ రంగాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఐజీఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సీజీఎస్టీ (కేంద్ర), ఎస్‌జీఎస్టీ (రాష్ట్ర) వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే తెలంగాణ మాత్రం అటు ఉత్పత్తి, తయారీ రంగాలు.. ఇటు వినియోగం కూడా ఎక్కువగా ఉన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉందని జీఎస్టీ వసూళ్ల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.



రెండు నెలల్లో రూ. 12 వేల కోట్లకుపైగా..!

రాష్ట్రంలో జూలైలో రూ.683 కోట్లు, ఆగస్టులో రూ.418 కోట్లు ఐజీఎస్టీ పన్ను వసూలైంది. ఇతర రాష్ట్రాలకు రవాణా చేసిన వస్తువులు, సేవల విలువలో ఇది సగటున తొమ్మిది శాతంగా భావించవచ్చు. ఈ లెక్కన రెండు నెలల్లో రాష్ట్రం నుంచి రూ.12 వేల కోట్లకుపైగా విలువైన వస్తుసేవలు ఎగుమతి అయినట్టు అంచనా వేస్తున్నారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండు నెలలే కావడంతో 65 శాతం వ్యాపార, వాణిజ్య సంస్థలే పన్ను పరిధిలోకి వచ్చాయి. ఈ శాతం పెరిగితే ఐజీఎస్టీ వసూళ్లు ప్రతినెలా రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు చేరుతాయని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన 2016–17లో తెలంగాణ నుంచి రూ.10 వేల కోట్లకుపైగా ఐజీఎస్టీ వసూలవుతుందని లెక్కిస్తున్నారు. అయితే జీఎస్టీ వినియోగ ఆధారిత పన్ను విధానం కాబట్టి ఆ వస్తుసేవలను వినియోగించిన రాష్ట్రానికే పన్ను సొమ్ము వెళుతుంది. రాష్ట్రం వసూలు చేసిన ఐజీఎస్టీ ముందుగా కేంద్రానికి బదిలీ అవుతుంది. కేంద్రం తన వాటాను మినహాయించుకుని.. మిగతా సొమ్మును వస్తుసేవలను దిగుమతి చేసుకున్న రాష్ట్రాలకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరిట పంపిణీ చేస్తుంది.



గ్రానైట్, ఫార్మా, ఐటీ ఎగుమతులే ఎక్కువ

రాష్ట్రం నుంచి ఎక్కువగా గ్రానైట్‌తో పాటు ఫార్మా ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయి. ఫార్మా రంగంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రెండోస్థానంలో ఉంది. ఎక్కువగా బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. దీంతో పాటు పంట ఉత్పత్తులు, వరి, పత్తి, మిర్చిల వాటా అధికంగా ఉన్నాయి. మొత్తంగా ఈ నాలుగు రంగాలకు సంబంధించే ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని.. వాటి ద్వారానే ఐజీఎస్టీ ఎక్కువగా సమకూరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు సైతం గణనీయంగా పెరగటంతో ఐజీఎస్టీ ఎక్కువగా వసూలైందని పేర్కొన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, హరియాణా నుంచి రాష్ట్రానికి వాహనాల దిగుమతి ఎక్కువగా ఉందని... దాంతో ఆ రాష్ట్రంలో వసూలైన ఐజీఎస్టీలో ఎక్కువ వాటా రాష్ట్రానికి వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.



అంతర్రాష్ట్ర జీఎస్టీతో భర్తీ

జూలైలో దేశవ్యాప్తంగా రూ. 26 వేల కోట్లు, ఆగస్టులో రూ. 24 వేల కోట్లు ఐజీఎస్టీ వసూలైంది. కేంద్రం ఇందులో సగం వాటాను ఇన్‌పుట్‌ క్రెడిట్‌గా సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. అందులో తెలంగాణకు రూ. 600 కోట్ల నుంచి రూ. 800 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా వసూలవుతున్న ఐజీఎస్టీ పన్ను స్థాయిలోనే రాష్ట్రానికి వాటా ఆదాయం వస్తోంది. అంటే ప్రతినెలా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న వస్తువులు, సరుకులకు దాదాపు సమాన స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే మిగులు రెవెన్యూ ఆదాయంతో పాటు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు కొత్త రాష్ట్రం నిలువుటద్దంగా నిలుస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  



ఐజీఎస్టీ వసూలు (రూ. కోట్లలో..)

జూలైలో... 683   

ఆగస్టులో... 418

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top