పరారైన వేటగాళ్లు ఒంగోలులో..

పరారైన వేటగాళ్లు ఒంగోలులో..


ఓ భూస్వామి ఇంట ఆశ్రయం

ఏడుగురికి ఇద్దరు సహాయకులు

ముగ్గురి లొంగుబాటు, పరారీలో మిగిలిన వారు

కరీంనగర్, హైదరాబాద్‌లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు




సాక్షి, భూపాలపల్లి: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితులు ఏపీలో ఓ భూస్వామి ఇంట ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోగా మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ అడవుల్లో దుప్పులను వేటా డిన కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై పోలీసు శాఖ అభియోగం మోపింది. అయితే, కేసులో కీలక పాత్ర పోషించిన ఏ 4 నింది తుడు అక్బర్‌ఖాన్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నా డు.



 ఘటన జరిగిన తర్వాత ఐదు రోజుల పాటు అతను మహదేవపూర్‌లో స్వేచ్ఛగా తిరిగాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్‌ఖాన్, ఖలీముల్లా ఖాన్‌లు లొంగిపోయారు. వీరి లొంగుబాటు వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించి అక్బర్‌ ఖాన్‌ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహదేవపూర్‌ ప్రాంతంలో దగ్గరి సంబంధా లున్న ఒంగోలుకు చెందిన భూస్వామి వద్దకు వీరు చేరుకున్నట్లు తెలుస్తోంది.  



మూడు బృందాలు

దుప్పులను వేటాడి చంపిన నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఫజల్‌ మహ్మద్‌ ఖాన్‌ కోసం ఓ బృందం హైదరాబాద్‌ లో గాలిస్తుండగా గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృం దాన్ని ఏర్పాటు చేశారు. మున్నా అనే నింది తుడి కోసం ఇంకో బృందం గాలిస్తోంది. పోలీసు రికార్డుల్లో ఏ 1 నిందితుడు సత్యనారాయణతో పాటు అతని బంధువు వేటలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.  



అదే నంబరుతో అనేక ఇళ్లు..

సంఘటనస్థలంలో లభించిన ఫజల్‌ మహ్మద్‌ఖాన్‌ ఆధార్‌కార్డు ప్రకారం అతని అడ్రసు 10–3–292, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌గా ఉంది. ఈ కాలనీలో ఓ పాఠ శాల పక్కన ఇదే నంబరుతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉండటం గమనార్హం.  పోలీసులు ఇందు లో ఏ ఇంటికి వెళ్లారు... అసలు ఫజల్‌ మహ్మద్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తేలడం లేదు.



చౌటుప్పల్‌లో జింకపిల్ల

మార్చి 23న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామం దగ్గర హైవే టోల్‌గేట్‌ సమీప పొలాల్లో గాయంతో తిరుగుతున్న జింకపిల్లను రైతులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగిం చారు. 25న జింకపిల్ల చనిపోయింది. మహదేవపూర్‌ అడవుల్లో మార్చి 19న ఐదు వన్యప్రాణులను చంపగా ఇందులో రెండు దుప్పుల కళేబరాలను అటవీ శాఖ అధికా రులు పట్టుకున్నారు. మిగిలిన వన్యప్రాణు లతో ఏటూరునాగారం మీదుగా హైదరాబా ద్‌కు వేటగాళ్లు పారిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో వీరు జింకపిల్లను మార్గమధ్యలో విడిచి వెళ్లారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.



హైదరాబాద్‌లో అమ్జద్‌ అరెస్ట్‌?

దుప్పుల వేటలో పాల్గొన్నాడనే అనుమానం తో మహదేవపూర్‌కు చెందిన అమ్జద్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అమ్జద్‌ కొన్నేళ్లుగా హైదరాబాద్‌ లో ఏసీ మెకానిక్‌ గా జీవనం సాగిస్తున్నాడు.  అక్బర్‌ఖాన్‌కు సన్నిహితుడిగా పేరున్న అమ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.



వేటగాళ్లను త్వరలోనే పట్టుకుంటాం

అటవీశాఖ విజిలెన్స్‌ డీఎఫ్‌వో రాజశేఖర్‌


మహదేవపూర్‌: దుప్పులవేట సంఘటనలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వేటగాళ్లం దరినీ పట్టుకుంటామని అటవీశాఖ విజిలెన్స్‌ డీఎఫ్‌వో రాజశేఖర్‌ చెప్పారు. మహదేవపూర్‌ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేటగాళ్లు దుప్పులను వేటాడిన పంకెన అడవుల్లోని సంఘ టన స్థలాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించా మని, వేటగాళ్ల ముఠాలో చాలామంది ఉన్న ట్లుగా ప్రజలు సమాచారమిచ్చారని చెప్పా రు.



 ప్రధాన నిందితుడు అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. వేటగాళ్లలో ఇద్దరు మైనర్‌లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోందని, హైదరాబాద్, కరీంనగర్, సెంటినరీకాలనీ, మహదేవపూర్, సూరారం గ్రామాలకు చెం దిన వారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు విచారణలో తెలుస్తోందని పేర్కొ న్నారు. మహదేవపూర్‌లోని తెనుగువాడలో నెన్నెల గట్టయ్య బంధువు ఇంట్లో గట్టయ్య తో పాటు మున్నా షల్టర్‌ తీసుకున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించామని, తమ రాకను ముందుగానే గమనించిన ఇంటి యజమాని ఆనవాళ్లను మాయం చేసి నట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.  



గట్టయ్య ఇంటివద్ద విచారణ జరుపుతున్న సమ యంలో ఆయన భార్యకు వచ్చిన ఫోన్‌కాల్‌ డాటాను సేకరించేందుకు సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలోని  కారు గట్టయ్య ఇంటి సమీపంలో లభించడంతో దానినీ అధీనంలోకి తీసుకున్నట్లు రాజశేఖర్‌ వివరించారు. వేటగాళ్లకు సహకరిస్తున్న ఇంటి దొంగలపై దృష్టిసారిస్తామని  హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top