కడుపు కోత

కడుపు కోత - Sakshi


తండాల కంటతడి..

 విషాదం మిగిల్చిన ‘కర్ణాటక’ ప్రమాదం

 వలస కూలీల మృతితో కన్నీరుమున్నీరు

 మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు

 స్థానికంగా ఉపాధిలేకే వలసబాట

 మనూరు:
తండాలు తల్లడిల్లాయి. అయిన వారిని పోగొట్టుకుని గుండలవిసేలా విలపించాయి. కర్ణాటక రాష్ట్రంలో మంగళవా రం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వలస బతుకుల్లో పెను విషాదాన్ని నింపింది.

 మనూరు మండలానికి చెందిన గిరిజన వలస కూలీలు కర్ణాటకలోని దత్తుర్గి చక్కెర కర్మాగారం పరిధిలో చెరకు నరికే పనుల కోసం సోమవారం రాత్రి కుటుంబాలతో సోమవారం రాత్రి బయల్దేరారు. కరస్‌గుత్తి చోక్లా తండా, ఇరక్‌పల్లి విఠల్‌తండా, డోవూర్ సీఎం తండా నుంచి పదుల సంఖ్యలో గిరిజనులు ట్రాక్టర్‌లో పయనమయ్యారు. మంగళవారం వేకువజామున కర్ణాటకలోని బీదర్ జిల్లా

 హుమ్నాబాద్ తాలూకా చిన్న హళీకేడ్ ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది.

 

  విఠల్‌తండాకు చెందిన సవితాబాయి (25), తల్లీ కొడుకులు జాదవ్ సేవాబాయి (36), జాదవ్ కృష్ణ (03), చోక్లా తండాకు చెందిన కృష్ణ (08), డోవూర్ సీఎం తండాకు చెందిన జైసింగ్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. చోక్లాతండాకు చెందిన జగ్గుబాయి (35), మీరాబాయి (30), రాందాస్(15), డోవూర్ తండాకు చెందిన రవీందర్ (16) తీవ్ర గాయాలతో గుల్బర్గా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి బయల్దేరిన తమ వారు ప్రమాదానికి గురైనట్టు తెలుసుకున్న ఇక్కడి తండాలలోని బంధువులు సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు.

 

 ఎవర్ని కదిపినా కన్నీళ్లే..


 మృతుల కుటుంబాల రోదన కంటతడి పెట్టించింది.  విఠల్‌తండాకు చెందిన తల్లీకొడుకులు జాదవ్ సేవాబాయి, చిన్న కుమారుడు కృష్ణ మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. వసంత్, సేవాబాయి దంపతులకు ఇద్దరు కవల కుమార్తెలు గౌరి, గంగ (6), కుమారులు పింకి, సునీల్, కృష్ణ (3) ఉన్నారు. సేవాబాయి.. చిన్న కుమారుడిని తీసుకుని వలస వెళ్తూ కొడుకుతో సహా మృతిచెందింది. తల్లిని కోల్పోయిన గౌరి, గంగ, పింకి, సునీల్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. డోవూర్ సీఎం తండాకు చెందిన జైసింగ్ కుటుంబం అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ ప్రమాదంలో అతని కుమారుడు రవీందర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కరస్‌గుత్తి చోక్లాతండాకు చెందిన రాందాస్, మీరాబాయిల నలుగురు సంతానంలో చిన్న వాడైన కృష్ణ (8) మృతి చెందగా, మీరాబాయి వెన్నుపూసకు బలమైన గాయమైంది. విఠల్‌తండాకే చెందిన భజరంగ్, సవితబాయి (25)కి ఏడాది క్రితమే వివాహమైంది. బతుకుదెరువుకు వలస వెళ్తుండగా, సవితాబాయి మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో భజరంగ్ అక్క లలితాబాయికీ తీవ్ర గాయాలయ్యాయి.

 

 బతుకు దెరువులేకే వలస


 నారాయణఖేడ్/ మనూరు: కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్ చిన్న హళికేడ్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారంతా బతుకు దెరువు లేకే వలసవెళ్లిన వారే. మృతుల కుటుంబాలన్నీ నిరుపేద గిరిజన కుటుంబాలు. ఇరక్‌పల్లి విఠల్ తండాకు చెందిన సవితాబాయి, జాదవ్ సేవాబాయి, డోవూరు సీఎం తండాకు చెందిన జైసింగ్ కుటుంబాలకు కుంట భూమి కూడా లేదు. వ్యవసాయం చేసుకొనేందుకు భూమి లేకపోవడంతో వీరికి కూలీ పనులే గతి. తండాలో ఉన్న సందర్భాల్లో వీరు ఇతరుల వ్యవసాయ భూముల్లోకి కూలీ పనులకు వెళ్తుంటారు. లభించే కొద్దిపాటి కూలీతోనే పొట్టపోసుకొని జీవిస్తుంటారు.  పనులు లభించక పడరాని పాట్లు పడుతుంటా రు. కూలీ లభించన నాడే వీకి కుటుంబాల్లో పండగ.. పనులు లేనినాడు పస్తులే..

 

 రాందాస్ భూమి ఎండింది..  


 కరస్‌గుత్తి చాక్లా తండాకు చెందిన రాందాస్‌కు రెండెకరాల భూమి ఉంది. వర్షాధారంగా కంది సాగుచేశారు. వర్షాభావంతో సాగుచేసిన కందిపంట ఎండుదశ పట్టింది. దీంతో రాందాస్ దిగాలుపడ్డాడు. ఇక కుటుంబ పోషణకు వలస తప్పదని నిర్ణయించుకొన్నాడు. తోటి గిరి జనులు వలస వెళ్తున్నారని తెలుసుకొని భార్య, కొడుకుతో సోమవారం రాత్రి తానూ పయనమయ్యాడు. ఈ ప్రమాదంలో ఇతని భార్య మీరాబాయి నడుము విరిగి తీవ్ర గాయాలపాలు కాగా, కొడుకు కృష్ణ (8) మరణించాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top