రైతుల రుణాలు మాఫీ


 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతు రుణమాఫీ విధి విధానాలపై బ్యాంకర్లతో చర్చించిన జిల్లా యంత్రాంగం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రుణమాఫీ సొమ్మును ఆన్‌లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీ వర్తింపు, లబ్ధిదారుల జాబితా ప్రకటనపై మార్గదర్శకాలను విడుదల చేశారు.



 సామూహికంగా (జేఎల్‌జీ) తీసుకున్న రుణాల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ శ్రీధర్ కోరగా, రుణమొత్తాన్ని వ్యక్తుల వారీగా విభజించి రూ.లక్షలోపు అప్పును మాఫీ చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలో రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయడం వల్ల కొత్తగా పంట రుణాలు తీసుకోవడానికి, పంటల బీమా వర్తింపజేసుకోవడానికి మార్గం సుగమమవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో జేసీ-2 ఎంవీ రెడ్డి, డీఆర్‌ఓ సుర్యారావు, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఎల్‌డీఎం సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు పాల్గొన్నారు.



ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలు, బంగారంపై తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుంది.

     

గరిష్టంగా రూ.లక్షవరకే మాఫీ అవుతుంది.

     

రైతులు పలు బ్యాంకుల్లో రుణాలు పొందినా..

 

రుణమాఫీ మాత్రం లక్ష రూపాయలకే వర్తిస్తుంది.

     

సాధ్యమైనంతవరకు రైతుల ఖాతాలను ఆధార్‌కార్డుతో

 అనుసంధానం చేయాలి. అయితే ఇది తప్పనిసరి కాదు.

     మార్చి 31 తర్వాత రైతులు రుణాలు చెల్లించినా మాఫీ వర్తిస్తుంది.

 

 రైతుల జాబితాను రూపొందించి ఈ నెల 23లోగా బ్యాంకర్లు తహసీల్దార్లకు అందజేయాలి.

     25, 26వ తేదీల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగే మండలస్థాయిలో బ్యాంకర్ల సమావేశం జాబితాకు తుది రూపు ఇస్తారు.

     ఈ జాబితాను 27, 28వ తేదీల్లో గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.

     29న ఫిర్యాదులను తహసీల్దార్, ఎంపీడీఓ, బ్యాంకు ప్రతినిధులు పరిశీలిస్తారు.

     30న జిల్లాస్థాయిలో జరిగే బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో రుణమాఫీకి అర్హులైన జాబితాపై చర్చించి.. ఎస్‌ఎల్‌బీసీకి నివేదిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top