రుణమాఫీలో.. నకిలీ బాగోతం


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 69 ప్రకారం రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రుణమాఫీ కోరుతున్న రైతులు ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను అందజేయాల్సిందిగా రైతులను ఆదేశించారు. గ్రామాల వారీగా రుణమాఫీ కోరుతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ పేరిట బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు.



ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో గ్రామాల వారీగా పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించారు. రుణమాఫీకి అర్హత కలిగిన ఏ ఒక్క రైతూ నష్టపోకుండా వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 349 వివిధ బ్యాంకుల శాఖల ద్వారా రూ.749 కోట్లు రైతులు రుణంగా పొందినట్లు గురించారు. తొలిరోజు పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

 

బ్యాంకర్ల సహకారంతోనే..

బ్యాంకర్ల సహకారంతో రైతుల ముసుగులో నకిలీ రైతులు చెలరేగిపోయినట్లు గుర్తించారు. భూమి లేకున్నా పాసు పుస్తకాలు సృష్టించి కోట్లాది రూపాయలను పంట రుణం రూపం లో నొక్కేశారు. సామాన్యుడు రుణం కోసం బ్యాంకు మెట్లెక్కితే సవాలక్ష నిబంధనలతో బెదరగొట్టే బ్యాం కర్లు నకిలీలకు రుణ మంజూరులో మాత్రం ఉదారంగా వ్యవహరించారు. పాసు పుస్తకాల్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రా మ రెవెన్యూ అధికారుల సంతకాలను నకిలీ రాయుళ్లు యధేచ్ఛగా ఫోర్జరీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస బ్యాంకు శాఖల్లో ఈ రకమైన ‘నకిలీలలు’ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ ఆఫీసర్ల సహకారం లేనిదే ఈ రకమైన రుణ మంజూరు సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

బయటపడుతున్న బాగోతం

తొలిరోజు పరిశీలనలో నారాయణపేటలో 1321, మక్తల్‌లో 814, నాగర్‌కర్నూలులో 1894,కొల్లాపూర్‌లో 2276, మహబూబ్‌నగర్‌లో 714 మంది నకిలీ పాసుపుస్తకాలు తనఖా పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. గద్వాల, వనపర్తి డివిజన్ పరిధిలో బ్యాంకర్లు రుణమాఫీ కోరుతున్న రైతుల జాబితాను ఇంకా అందజేయాల్సి ఉంది. మరో మూడు రోజుల పాటు తహశీల్దార్, ఎంపీడీఓ, వీఆర్‌ఓ, బ్యాంకుల ప్రతి నిధులతో కూడిన కమిటీ ఈ పరిశీలన మరింత ముమ్మరం చేయనుంది.



పరిశీలన పూర్తయితే వందల కోట్ల రూపాయలు నకిలీలు కాజేసిన వైనం వెలుగు చూసే అవకాశముంది. తమ బాగో తం బయటపడుతుందనే భయంతో కొన్ని చోట్ల బ్యాంకర్లు రుణమాఫీ రైతుల జాబితా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ‘అర్హులకు అన్యా యం జరగకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పరిశీలనలో నకిలీల వ్యవహారం వెలుగు చూడడం ఆశ్చర్యకరం.



ఈ నెల 30వ తేదీలోగా అన్ని గ్రామాల్లో పాసుపుస్తకాల పరిశీలన పూర్తి చేయా లి. బ్యాంకర్లు గురువారంలోగా తప్పనిసరిగా రైతుల జాబితా ఇవ్వాలని’ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంత రం బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో రుణమాఫీ అర్హత కలిగిన రైతుల వడపోతపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top