రైతాంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట

రైతాంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట - Sakshi


* త్వరలో రుణమాఫీహామీ పత్రాలు

* మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి


బాన్సువాడరూరల్ : దేశానికి అన్నంపెట్టే రైతన్నల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొల్లూర్ గ్రామంలో రూ.18లక్షల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల గోడౌన్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 250కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈసారి బీపీటీ ధాన్యానికి మద్దతుధర  లేకపోవడంతో అక్కడడక్కడ ధాన్యం రాశులు పేరుకు పోయిన మాట తమ దృష్టికి వచ్చిందన్నారు.



వారంతా రైతుబంధు పథకంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిల్వచేసి, పంటవిలువలో 75శాతం వరకు అప్పుగా తీసుకునే వెసులుబాటు వుందన్నారు. తీసుకున్న అప్పుకు గరిష్టంగా రూ. 2లక్షలకు 6మాసాల వరకు ఎలాంటి వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృషితో ఈసారి 25 ఎకరాల్లో రైతులకు ఫౌండేషన్ సీడ్ సాగు చేయిచడం అభినంద నీయమన్నారు. ప్రభుత్వం విత్తనాలను  మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.



జిల్లాలో 160 గోడౌన్‌లు నిర్మించడానికి నాబార్డుకు ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌లను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ హామీ పత్రాలు అందిస్తామన్నారు. గ్రామస్తులు సూచించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించడానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. అంతకు ముందు కొల్లూర్ మసీద్ వద్ద మంత్రిని ముస్లింలు  ఘనంగా సన్మానించారు. పాఠ శాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.



సభ ప్రారంభానికి ముందు ఇటీవల  రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొల్లూర్ గ్రామ సర్పంచ్ మాధవీ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ మాసాని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రేష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ విజయగంగాధర్, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి, నార్లసురేష్, ఇన్‌చార్జి సర్పంచ్ బస్వంత్, ఎంపీటీసీ సభ్యురాలు సురేఖరాచప్ప , మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top