తేలని కచ్చితమైన లెక్క

తేలని కచ్చితమైన లెక్క - Sakshi


 నల్లగొండ అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీపై ఇంకా కచ్చితమైన లెక్క తేలలేదు. రూ.లక్షలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. రూ.లక్షలోపు రుణం తీసుకుని రుణమాఫీ అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఆదివారం వరకు కలెక్టర్, జేడీఏకు అందజేయాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ బ్యాంకర్లు మండలాలు, గ్రామాల వారీగా రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను తయారు చేసేటప్పుడు కొన్ని తప్పిదాల వల్ల చాలామంది రైతుల పేర్లు జాబితాలో లేకుండాపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన వారు సుమారు 5లక్షల మంది రైతులున్నట్టు తెలుస్తోంది.

 

 వీరికి సంబంధించి రూ.2756 కోట్ల మేరకు పంటరుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మండల, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను రెండు మూడు రోజుల నుంచి ఆయా గ్రామ పంచాయతీల వద్ద అతికిస్తున్నారు. తమ పేర్లు జాబితాలో లేవని చాలా గ్రామాలలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని స్వీకరించి అర్హత ఉంటే తప్పక జాబితాలో చేర్చుతామని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ జాబితాను సిద్ధం చేయనున్నారు.

 

 ఏదేమైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రుణాలను పొందిన రైతుల వివరాలను సేకరిస్తే పక్కా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు.. ముగ్గురు రుణాలను పొందడం, ఒక వ్యక్తి రెండు మూడు బ్యాంకులలో రుణాలను తీసుకున్న సంఘటనలు ఉన్న నేపథ్యంలో తుది జాబితా తయారు కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎన్ని బ్యాంకులలో రుణాలను తీసుకున్నా, ఇద్దరు ముగ్గురు రుణాలను తీసుకున్నా ఒక్కో కుటుంబంలో రూ.లక్షలోపు వరకే రుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top