సిండికేట్ దోపిడీ


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మద్యం సిండికేట్లు మళ్లీ పుట్టుకొచ్చాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో మద్యం వ్యాపారులు జట్టుకట్టి అడ్డగోలు దోపిడీ షురూ చేశారు. వరుస ఏసీబీ దాడులు, కేసుల నమోదుతో గతంలో సిండికేటు అక్రమాలకు చాలా వరకు చెక్‌పడింది. మళ్లీ ఇప్పుడు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వస్తున్న లాభాలు సరిపోవడం లేదని ఈ అక్రమార్జనకు తెరలేపా రు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ నిండా ముంచుతున్నారు.



ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కూలింగ్ చార్జీల పేరుతో ఒక్కో బీరుపై అదనంగా రూ.ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ గుంజుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల ఈ బహిరంగ దోపిడీ కొనసాగుతున్నా ఎక్సైజ్ శాఖ కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం సిండికేట్ల వద్ద ప్రతినెలా మమూళ్లు పుచ్చుకున్న ఎక్సైజ్, పోలీసు ఇతర శాఖల అధికారులపై ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతున్నా మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మద్యం సిండికేట్లు షురూ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.



జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, తాండూరు, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర పట్టణాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గతంలో మాదిరిగా కొన్నిచోట్ల సిండికేట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న బెల్లంపల్లిలోని ఓ వైన్సుపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారం రోజులపాటు ఈ మద్యం వైన్స్ లెసైన్సును సస్పెండ్ చేయడంతోపాటు, జరిమానా కూడా విధించారు.



వచ్చే లాభాలు సరిపోవని..

జిల్లాలో 149 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్‌లో ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. 974 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు రాగా, మిగిలిన షాపులకు గట్టి పోటీ నెలకొంది. జూన్ 23న లాటరీ పద్ధతిలో ఈ మద్యం షాపులను కేటాయించారు. మద్యం షాపుల యజమానులు ఐఎంఎల్ డిపో నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయిస్తుంటారు.



ఇలా ఏడు పర్యాయాలు మద్యం డ్రా చేసిన తర్వాత తమకు వచ్చే లాభాలు తగ్గిపోయాయంటూ ఈ దోపిడీకి తెరలేపారు. కొన్ని చోట్ల సిండికేటు వ్యాపారులు కల్తీ మద్యం విక్రయాలకు తెర లేపారు. మద్యం సీసా మూతను తీసి అందులో నీళ్లు గానీ, చీప్ లిక్కర్‌ని కలిపి ఏ మాత్రం గుర్తుపట్టని విధంగా ఆ సీసా మూతను బిగించేస్తున్నారు. ఇలా మద్యం కల్తీకి పాల్పడిన లక్సెట్టిపేటలోని ఓ వైన్సుపై ఎక్సైజ్ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు.



బార్‌కోడ్‌కు ససేమిరా..

బార్‌కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు మద్యం వ్యాపారులు ససేమిరా అంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. బార్‌కోడ్ విధానం అమలైతే మద్యం వ్యాపారుల అక్రమాలకు చాలా మట్టుకు చెక్ పడుతుంది. నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు జరిగితే ఎక్సైజ్ అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఆయా మద్యం షాపుల్లో మద్యం విక్రయాలపై ఆన్‌లైన్ పర్యవేక్షణ ఉంటుంది.



ఈ విధానం అమలైతే తమ గుట్టు రట్టవుతుందనే భయంతో వ్యాపారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపారులేమో దీన్ని అనవసర వ్యయంగా చెప్పుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే ఈ బార్ కోడ్ విధానం అమలులోకి రావాల్సి ఉండగా, జిల్లాలో కనీసం ఒక్క షాపులో కూడా కనిపించడం లేదంటే  ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులకు మధ్య ఉన్న ‘అనుబంధం’ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.



మా దృష్టికి వచ్చింది

- శివరాజు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ


జిల్లాలో కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరచూ తనిఖీలు చేస్తున్నాం. కేసులు కూడా నమోదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల్లో బార్‌కోడ్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top