మార్ఫింగ్ మాయ


- లెసైన్స్‌ల జారీకి నకిలీ ధ్రువీకరణ పత్రాలు

- కన్సల్టెన్సీలు కేంద్రంగా జోరుగా దందా

- రూ.లక్షలు ఆర్జిస్తున్న నిర్వాహకులు

- కొరవడిన పోలీసుల నిఘా

సాక్షి, హన్మకొండ :
రవాణా శాఖ కార్యాలయూలను కేంద్రంగా చేసుకున్న కన్సల్టెన్సీలు నకిలీ ధ్రువీకరణ పత్రాల తయూరీకి తెరలేపాయి. డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం వచ్చేవారిని మచ్చిక చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. లెసైన్సు పొందాలంటే విద్యార్హత, వయస్సు, నివాస స్థలం వివరాల ధ్రువపత్రాలు తప్పనిసరి. ద్విచక్రవాహనదారులు, లైట్ వెయిట్ ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ లెసైన్సు కోసం వచ్చే దరఖాస్తుదారులకు నిబంధనలతో ఇబ్బంది లేదు. కానీ, లారీలు, ట్రక్కు లు నడిపేందుకు లెసైన్సు కోసం దరఖాస్తు చేసేవారిలో ఎక్కువ మందికి పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు(టెన్త్ మెమో) ఉండటం లేదు. విద్యార్హతలు లేని వ్యక్తులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందచేస్తూ పలు ఆర్టీఏ కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంటర్‌నెట్ ద్వారా ఇతరుల సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్‌చేస్తున్నారు. ఆ తర్వాత పేరు, ఫొటో, పుట్టిన రోజు తదితర వివరాలు మార్ఫింగ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని తాత్కాలిక ప్రయోజనం కలిగించే నకిలీ టెన్త్ సర్టిఫికేట్లను అందిస్తున్నారు. వీటిసాయంతో సదరు వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయం నుంచి లెసైన్స్‌లు పొందుతున్నారు.



జిల్లా అంతటా ఇదే తీరు

డిప్యూటీ రవాణా కమిషనర్, వరంగల్ కార్యాలయంతోపాటు జనగామ, మహబూబాబాద్ ప్రాంతీయ కార్యాలయాలు కేంద్రంగా పని చేస్తున్న కన్సల్టెన్సీలు మార్ఫింగ్‌కు పాల్పడుతున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారు చేయడం ద్వారా కన్సల్టెన్సీలు నెలవారీగా లక్షలాది రూపాయలు అక్రమర్గాల్లో సంపాదిస్తున్నాయి. కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఆర్టీఏ కార్యాలయం సిబ్బందికి మధ్య ఉన్న అవగాహన కారణంగా ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ నకిలీ దందాకు అలవాటు పడిన కింది స్థాయి సిబ్బంది తాజాగా దరఖాస్తుతోపాటు అన్ని ధ్రువపత్రాలు జతపరిచినా రకరకాల సాకులు చూపుతూ సరిగా లేవంటూ కొర్రీలు పెడుతున్నారు. ఇటీవలే ఈ విషయంపై ఆర్టీవోకు ఫిర్యాదులు అందాయి.



పట్టించుకోని పోలీస్ శాఖ

నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ రాకెట్‌పై గతంలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు నెల క్రితం ఆర్టీఏ కార్యాలయ సమీపంలో పనిచేస్తున్న కన్సల్టెన్సీ కేంద్రాలపై మిల్స్‌కాలనీ పోలీసు దాడులు చేశారు. ఈ దాడుల్లో నకిలీ టెన్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించి ఒక కన్సల్టెన్సీని సీజ్ చేసి నిర్వహకుడిని  అరెస్ట్  చేశారు. ఆ తర్వాత వీరిపై పోలీసు విభాగం దృష్టి సారించలేదు. దీనితో ఈ దందా తాత్కాలికంగా సద్దుమణిగిన ఇటీవల మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంది. కరీమాబాద్, కాశీబుగ్గ, హన్మకొండలకు చెందిన పలువురు కన్సల్టెన్సీలు ఈ దందాలో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది నకిలీ సర్టీఫికెట్లతో ఆర్టీఏ లైన్సులు జారీ అయినట్లుగా తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top