మోదీ ఇమేజ్‌తో గెలుద్దాం

మోదీ ఇమేజ్‌తో గెలుద్దాం - Sakshi

2019లో అధికారం చేజిక్కించుకుందాం

- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే: లక్ష్మణ్‌

వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సభ

 

హన్మకొండ: ప్రధాని మోదీ ఇమేజ్‌తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పిలుపునిచ్చారు. విమర్శలకు తావులేకుండా ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. వరంగల్‌లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంమాధవ్‌ మాట్లాడుతూ.. 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాజకీయాలనేవి అధికారం కోసమేనని, ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దన్నారు.



అధికారంలో ఉంటే పాపులారిటీ తగ్గుతుందని, ఇందుకు భిన్నంగా ప్రధాని మోదీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోందని, ప్రధానికి 77 శాతం పాపులారిటీ ఉందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై అవినీతి విమర్శలు వచ్చాయని గుర్తు చేసిన రాంమాధవ్‌.. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ప్రధాని మోదీతో అవినీతి చేయించలేడన్నారు. సామాన్యుడైన సగటు భారతీయుడు నీతిమంతుడేనని రాంమాధవ్‌ అన్నారు. అధికారంలోకి వచ్చినవారు వ్యవస్థను మార్చాలని, ఇందుకు ధీరోదాత్తమైన నాయకత్వం కావాలని, మోదీ రూపంలో బీజేపీకి మంచి నాయకత్వం ఉందని చెప్పారు. 

 

రాష్ట్రంలో కుటుంబ పాలన: లక్ష్మణ్‌

రాష్ట్రంలో బంధుప్రీతి, కుటుంబ పాలన వేళ్లూనుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కోవ లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యాయం ముగిసిందని, కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే నినాదంతో దేశవ్యాప్తంగా బీజేపీ ముం దుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనీ, ఇక కార్యక్షేత్రానికి బయల్దేరుదామని కార్యకర్తలకు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలు, హెచ్‌ఎండీఏ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, భూముల కుంభకోణాలు వెరసి అన్ని శాఖల్లో అవినీతి రక్కసి విజృంభిస్తోందని ధ్వజమెత్తారు.



రాష్ట్ర రాజధాని డ్రగ్‌ మాఫియాకు కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోందని, మూడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్‌ఎస్‌.. డ్రగ్‌ మాఫియాను అరికట్టడంలో విఫలమైందని విమర్శిం చారు. కాంగ్రెస్‌ బాటలో నడుస్తున్న టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ఒత్తిళ్లకు లొంగి సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా నిర్వహించడం లేదని నిప్పులు చెరిగారు. సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి,  రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణదాస్‌ పాల్గొన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top