తిరుగులేని శక్తిగా చేద్దాం


టవర్‌సర్కిల్ : కరీంనగర్ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉందని.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా నిలిచారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేద్దామన్నారు. మంగళవారం నగరంలోని అంబేద్కర్  స్టేడియంలో జరిగిన తెలంగాణ టీడీపీ జిల్లా ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసుకున్న గడ్డ అని, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న కొలువైన నేల అని జిల్లాను కీర్తించారు. ఆర్థిక సంస్కరణలతో దేశచరిత్రను తిరగరాసిన మహనీయుడు పీవీ నర్సింహరావు ఈ జిల్లా బిడ్డ కావడం గర్వకారణమన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసి, అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

 టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ... కరువుప్రాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లా టీడీపీ హయూంలోనే సస్యశ్యామలంగా మారిందని, ఎస్సారెస్పీ నుంచి రూ.వెయ్యి కోట్లతో లైనింగ్ వేసి జిల్లాలోని గ్రామగ్రామానికి సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తయితే కరీంనగర్ ఎడారిగా మారుతుందని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తే ఆనాడు  కేసీఆర్ అపహాస్యం చేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. రాయికల్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటిస్తారని, రైతుల కడగండ్లు తీరుస్తారని ఆశపడితే నిరాశే మిగిలిందన్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీయాలని టీడీపీ శాసనసభ్యులను కోరారు.

 

 టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రా వు మాట్లాడుతూ పదవుల ఆశ కోసం మండల, నియోజవర్గ నేతలు పార్టీని వీడారని, గ్రామాల్లో క్యాడర్ కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేసీఆర్ మూడుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. కార్మికమంత్రిగా ఉండి బీడీ కట్టమీద పుర్రెగుర్తు వేయించాడని విమర్శించారు. నీరు, విద్యుత్ విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

 

 టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అణచివేతనుంచి పుట్టిన టీడీపీకి వేడివాడీ తగ్గలేదని కరీంనగర్ సభ నిరూపించిందన్నారు. జెండాను వదలకుండా ఉన్న కార్యకర్తలకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వారిపై కేసులు పెట్టినా ఇక్కడే ఉండి పోరాడుతామని భరోసా ఇచ్చారు. రాజకీయ బిక్షపెట్టిన టీడీపీని విమర్షిస్తున్న గంగుల కమలాకర్ గుంటనక్కలా అధికారం కోసం, గ్రానైట్‌ను కాపాడుకోవడం కోసం పార్టీ మారాడని ఎద్దేవా చేశారు. ఎంతమంది పోయినా ఉల్లిగడ్డమీద పొట్టు పోయినట్లేనన్నారు. ఈ రోజు నుంచి టీఆర్‌ఎస్, టీడీపీ నువ్వానేనా అన్నట్లు పోరాడుతామన్నారు. కేసీఆర్ తాత వచ్చినా తాట తీస్తామని సవాలు విసిరారు.

 

 టీటీడీపీ ఎన్నికల కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ జిల్లాలో ఖాళీ అయిందని ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు సవాలుగా సాహసోపేతంగా సభ నిర్వహించామన్నారు. ప్రజావ్యతిరేక టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు.

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ... ఎస్సారెస్పీ కింద 9.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే, జిల్లాలోనే 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని ఎస్సారెస్పీ నీటిని సాగుకు వదలకుండా, తాగునీటి పేరుతో మానేరు నింపి సిద్దిపేటకు తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటకు నీటిని నిలిపివేసి జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.

 

 సమావేశంలో ఎంపీలు గరిగెపాటి రామ్మోహన్‌రావు, గుండు సుధారాణి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మండవ వెంకటేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎంపీలు రమేశ్‌రాథోడ్, నామా నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బోడ జనార్దన్, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రాములు, నన్నూరి నర్సిరెడ్డి, టి.వీరేంద్రకుమార్‌గౌడ్, జెడ్పీటీసీ గంట అక్షితరాములు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, అన్నమనేని నర్సింగరావు, గండ్ర నళిని, మేడిపల్లి సత్యం, తాజొద్దీన్, కర్రునాగయ్య, సాంబారి ప్రభాకర్, పి.రవీందర్‌రావు, మద్దెల రవీందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు కళ్యాడపు ఆగయ్య, జాడిబాల్‌రెడ్డి, పుట్ట నరేందర్, దామెర సత్యం, చల్లోజి రాజు, గాజె రమేష్, కె.విజయేందర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, దూలం రాధిక, అనసూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top