హరిత ఉద్యమం చేద్దాం

హరిత ఉద్యమం చేద్దాం - Sakshi


 శామీర్‌పేట్ : దేశం ఎడారిలా మారకముందే హరితహారంను ఒక ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి విద్యార్థి ఒక సైనికుడు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ‘హరితహారం’లో భాగంగా తూంకుంట పరిధిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్, శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, తుర్కపల్లిలో జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.



కరువు కాటకాలు రావడానికి వర్షాలు రాక పోవడమే కారణమని, వర్షాలు పడకపోవడానికి అడవులు లేకపోవడమే కారణమన్నారు. అడవులను పెంచితే వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. మొత్తం పది జిల్లాలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఏకమై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే మూడేళ్లలో రాష్ట్రం పచ్చగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



 గోదావరి జలాలతో  శామీర్‌పేట్ చెరువును నింపుతాం..

 ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. తాగునీరు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శామీర్‌పేట్ మండలంతో పాటు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం నుంచి శామీర్‌పేట్‌కు గోదావరి జలాలు తరలించేందుకు రూ.3వేల కోట్లు కేటాయించి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. పాములపర్తి నుంచి శామీర్‌పేట్ పెద్ద చెరువులోనికి గోదావరి జలాలు తీసుకువచ్చి సంవత్సరంలోగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు.



కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, జోగురామన్న, ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కనకారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు గుత్తా జ్వాల, సింధూ, కష్యప్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డెరైక్టర్ దినకర్‌బాబు, స్కూల్ డెరైక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ ఎస్.వి.ప్రకాశ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశిధర్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, జేసీ రజత్‌కుమార్ సైనీ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఓఎస్‌డీ ప్రియాంక, ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎద్దునగేశ్, బత్తుల కిశోర్‌యాదవ్, నీరుడి కృష్ణ, ఎంపీటీసీలు సుదర్శన్, రేనుక మహేందర్, జహంగీర్, మల్లేష్‌గౌడ్, తహసీల్దార్ దేవుజా, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ వరలక్ష్మి,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top