లెక్కతేలింది


కరీంనగర్ అగ్రికల్చర్ :

 జిల్లాలో 31 మార్చి 2014 వరకు 4,76,717 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.2505.66 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఇందులో రూ.2221.2 కోట్లు పంట రుణాలు, రూ.234.63 కోట్లు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్నవి. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రకటించింది. సర్కారు మార్గదర్శకాల ప్రకారం మండలాల బ్యాంకర్లు, సంయుక్త కమిటీలు విచారిం చి లబ్ధిదారులను గుర్తించారు. జిల్లాస్థాయిలో వివరాలను క్రోడీకరించి తుదిజాబితా రూపొందించారు. వ్యవసాయ శాఖ జిల్లావ్యాప్తంగా 1683.14 కోట్ల మాఫీకి 3,84,105 మంది రైతులను అర్హులుగా జాబితా రూపొందించింది.

 ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో తనిఖీ

 అధికారుల తనిఖీల్లో వ్యవసాయ యోగ్యత లేని భూములు, నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నట్లు వెలుగుచూడడంతో సర్కారు పునఃపరిశీలనకు ఆదేశించింది. తహశీల్దార్ల వద్ద ఉన్న 1బీ రికార్డుల ప్రకారం అర్హులను గుర్తించాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పంపించింది. దీని ప్రకారం.. సర్వే నంబర్ల వారీగా పట్టాభూమి, అక్షరమాల ఆధారంగా లబ్ధిదారుల పేర్లు సరిచూసి రుణం తీసుకున్న లబ్ధిదారులను సరిపోల్చి అర్హుల తుది జాబితాను సిద్ధం చేశారు.

 64 మందే బోగస్

 వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన పాత జాబితాకు.. కొత్తగా రూపొందించిన జాబితాకు కేవలం 64 మందే తేడా వచ్చారు. వీరిని గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.64లక్షల భారం తప్పింది. తాజాగా అన్ని తనిఖీల తర్వాత 1బీ రికార్డుల పరిశీలన అనంతరం 3,84,041 మందికి 1681.86 కోట్లు మాఫీ అవుతాయని సంబంధిత అధికారులు, బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారమే మాఫీ అవుతాయని, నివేదికను కమిషనరేట్‌కు పంపిస్తామని పేర్కొంటున్నారు.







 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top