వైద్య శాఖలో అక్రమ బదిలీలు!

వైద్య శాఖలో అక్రమ బదిలీలు! - Sakshi


నిషేధమున్నా సరెండర్ పేరుతో కోరుకున్న చోటుకు ట్రాన్స్‌ఫర్

లంచావతారమెత్తి దొడ్డిదారులు వెతికిన ఓ కీలకాధికారి

150 మంది నుంచి రెండు మూడు లక్షల వరకు వసూలు

నల్లగొండ జిల్లాలో 50 మందికి అక్రమంగా డిప్యుటేషన్




సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలోని కీలక అధికారుల్లో ఆయన ఒకరు. ఆరు నెలల కిందట ప్రధానమైన ఆరో జోన్ లో బాధ్యతలు చేపట్టారు. పెద్దఎత్తున ముడుపులు చెల్లించి పోస్టింగ్ తెచ్చుకున్నట్లు ఆయనే ఒకటికి రెండుసార్లు కింది అధికారులతో అంటుం టారు. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి నిషేధం ఉన్నా సరెండర్(ఉద్యోగిని తిరిగి అప్పగించుట) పేరుతో దొడ్డిదారిలో పని పూర్తి చేస్తున్నారు.



ఒక్కొక్కరి నుంచి రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సరెండర్ కూడా కుదరకపోతే డిప్యుటేషన్‌తోనైనా జేబు లు నింపుకొంటున్నారు. రూ. 50 వేల చొప్పున తీసుకుని నల్లగొండ జిల్లాలో దాదాపు 50 మంది ఏఎన్‌ఎంలకు  డిప్యుటేషన్‌పై కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చేశారు. ఇక ఇదే జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధి తల్లికి ప్రమోషన్ ఇవ్వడం సాధ్యంకాకపోవడంతో 12 మంది ఏఎన్‌ఎంలకు పదోన్నతులను కూడా నిలిపివేశారు. వైద్య సిబ్బంది తాజాగా వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందాకు  ఈ విషయాలన్నీ చెప్పారు.

 

అక్రమాలు ఎలా జరిగాయంటే..

ఆరో జోన్ కిందకు వచ్చే నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో  బదిలీలు, డిప్యూటేషన్లతోనే సదరు అధికారి జేబు నిండుతోంది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటంతో అందుకు సరెండర్ విధానాన్ని ప్రత్యామ్నాయంగా మలుచుకున్నారు. సాధారణంగా సరెండర్ అంటే ఏదైనా ఆసుపత్రిలోని పారా మెడికల్ ఉద్యోగిపై విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరు తదితర ఆరోపణలతో మెమోలు వచ్చినట్లయితే ఆ ఉద్యోగిని ప్రాంతీయ కార్యాలయంలో రిపోర్టు చేయాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు ఇస్తారు. ఇక అతనిపై ప్రాంతీయ అధికారే నిర్ణయం తీసుకుంటాడు.



ఈ సౌలభ్యాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న సదరు కీలకాధికారి సరెండర్ల ద్వారా బదిలీలకు తెరదీశారు. జిల్లా వైద్యాధికారుల ద్వారా ఆరోపణలు చేయించడం, అవసరమైతే పాత తేదీలతో రెండు మూడు మెమోలు కూడా సృష్టించడం వంటివి చేసి కొందరు ఉద్యోగులను సరెండర్ చేయించారు.ఇలా దాదాపు 150 మందిని సరెండర్ చేయించి.. వారి నుంచి డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇచ్చారు. ఉదాహరణకు.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, సెలవులు ఎక్కువగా పెడుతున్నాడని రంగారెడ్డి జిల్లాలో ఒక సూపరింటెండెంట్‌ను సరెండర్ చేయించి అతన్ని ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేశారు.  ఇష్టారాజ్యంగా సరెండర్ చేయడం వల్ల అనేక చోట్ల సిబ్బంది కొరత ఏర్పడింది.

 

ప్రజాప్రతినిధి తల్లి కోసమేనా?

నల్లగొండ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి తల్లి ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. అతను ప్రజాప్రతినిధి అయ్యాక అధికారులు ఆమె పనిచేస్తున్న చోటుకు మరొకరిని డిప్యుటేషన్‌పై అదే కేడర్‌లో పంపించడం మరీ విడ్డూరం. అక్కడ మరో ఏఎన్‌ఎం పోస్టు లేకపోయినా కేవలం ఆ ప్రజాప్రతినిధి తల్లికి పనిచెప్పకూడదనే అలా చేశారు. ఆమెకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది.



తల్లికి పదోన్నతి కల్పించాలని సదరు ప్రజాప్రతినిధి ప్రయత్నించారు. కానీ పదోన్నతులకు అర్హుల జాబితాలో ఆమె కంటే మరో 12 మంది ముందున్నారు. కారణమేదైనా మొత్తం ప్రక్రియనే పెండింగ్‌లో పెట్టారు. 12 మందికీ పదోన్నతులు నిలిచిపోయాయి. దీనిపై హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ధర్నా కూడా చేశారు.

 

నిబంధనల ప్రకారమే చేశాం: ఆమోస్

సరెండర్ పేరుతో డబ్బులు తీసుకొని ఉద్యోగులను బదిలీ చేయలేదని, నిబంధనల మేరకే చేశామని ఆరో జోన్ ప్రాంతీయ అధికారి ఆమోస్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. అక్రమాలు జరిగాయనడం అవాస్తవమన్నారు. అలాగే ఎవరి కోసం కూడా పదోన్నతులు ఆపలేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top