పదవుల జాతర!


సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి:  పదవుల పంపకానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కమిటీల్లో దాదాపు 150 మందిని నామినేట్‌చేసే అవకాశముంది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, వివిధ సంస్థల పాలకవర్గాలతోసహా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లభించనుంది.



 దీంతో ఈ పోస్టులపై గంపెడాశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ నాయకులు.. లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆశీస్సులతో నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు లభించని ఆశావహులను నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరుస్తామని అప్పట్లో టీఆర్‌ఎస్ అధినాయకత్వం మాటిచ్చింది. ఈ క్రమంలోనే పార్టీకోసం శక్తివంచన లేకుండా పనిచేసిన నేతలు ఈ పోస్టులను ఆశిస్తున్నారు.



 11 మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు

 జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలోనే కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో తొమ్మిదింటికి గత ప్రభుత్వంలో నియమించిన కమిటీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవానికి కొత్త సర్కారు కొలువుదీరన వెంటనే నామినేటెడ్ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే, చాలాచోట్ల పాలక కమిటీలు వైదొలగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిటీలను రద్దు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నూతన పాలకవర్గాల నియామకానికి మార్గం సుగమం చేయాలని యోచిస్తోంది. తాండూరు, వికారాబాద్, పరిగి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సర్దార్‌నగర్, చేవెళ్ల, మర్పల్లి, ధారూర్, శంకర్‌పల్లి మార్కెట్ కమిటీలకు త్వరలోనే కొత్త కమిటీలను ప్రకటించనున్నారు.



 రాష్ట్రస్థాయి పోస్టులపైనా..

 కేవలం జిల్లాస్థాయి పోస్టులేకాకుండా రాష్ట్రస్థాయి పదవులపైనా సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో కీలకపోస్టును కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవిని కూడా ఇస్తానని సంకేతాలిచ్చినా, ప్రస్తుతానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.



 కేబినెట్ హోదా గల ఈ పదవితో హరీశ్వర్‌ను జిల్లా రాజకీయాల్లో క్రియాశీలం చేయాలని ఆయన యోచిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపులో తోడ్పాటునందించిన కరణం పురుషోత్తమరావు, చల్లా మాధవరెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, కొత్త మనోహర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, శంభీపూర్ రాజుకు సముచిత స్థానం కల్పించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ, హాకా, హెచ్‌ఎండీఏ, శాప్, కాలుష్య నియంత్రణ మండలి తదితర కమిటీల్లో చోటు లభించే అవకాశముంది.



గతంలో వివిధ పార్టీలో పనిచేసిన వీరిలో కొందరికి పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో నామినేటెడ్ పోస్టులపై గురిపెట్టిన వీరంతా అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. మరోవైపు జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థ, వక్ఫ్‌బోర్డు, ఆర్టీఏ మెంబర్, డీపీసీ సభ్యులుగా రేసులో నిలిచేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.



 పదవులపై కన్నేసి..

 పదవులపై కన్నేసిన ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో గులాబీదళానికి అంతగా పట్టులేదు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ఆ పార్టీకి నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, అనూహ్యంగా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్, టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు దిగువశ్రేణి నాయకులు కారె క్కేందుకు రెడీ అంటున్నారు.

 

నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలనే ముందుచూపుతోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సమర్థ నాయకత్వంలేదు. ఈ పరిణామాలను ఆసరా చేసుకున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top