ఆలస్యంగానైనా.. స్వైన్‌ఫ్లూపై అప్రమత్తం


 హైదరాబాద్ తర్వాత ఎక్కువమంది స్వైన్‌ఫ్లూ బారిన పడింది పాలమూరు జిల్లాలోనే.. 14మందికి ఈ లక్షణాలు కనిపించగా.. ఒకరు మరణించారు. ఒక్కమహబూబ్‌నగర్ పట్టణంలోనే 12మంది బాధితులున్నారు. దీని ప్రభావం గత నెల నుంచే ప్రారంభమైనా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలను చైతన్యం చేసే పరిస్థితి లేదు. చివరకు ప్రభుత్వం స్పందిం చడంతో ఆలస్యంగానైనా అధికారులు తేరుకున్నారు. ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ఆస్పత్రుల్లో మందులు, ప్రత్యేక వార్డులు అందుబాటులోకి తెచ్చారు.

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక అధికారిగా నియమితులైన పంచాయతీరాజ్ ముఖ్య కమిషనర్ రేమండ్ పీటర్ గురువారం జిల్లాకు వచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బాధితులకు అవసరమైన మందులు జిల్లాకు చేరినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి లక్షణాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేందుకు గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల వ్యాధికారక వైరస్, వ్యాధి లక్షణాలు తదితరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి రేమాండ్ పీటర్ గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో పాటు ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కాగా ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కోసం రెండు ప్రత్యేక వార్డులుండగా, అదనంగా మరో నాలుగు వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యాధి నివారణకు అవసరమైన 500 టామీ ఫ్లూజిల్లాకు చేరుకున్నాయి. ఇందులో 250 కిట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రికి, మరో 250 కిట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రులకు కేటాయించారు. మరో 500కిట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటివరకు జిల్లాలో 35 శాంపిళ్లు సేకరించగా, 14మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ లక్షణాలున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్దరణకు స్థానికంగానే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి డాక్టర్ రాంబాబు నాయక్, 85 పీహెచ్‌సీలకు డాక్టర్ శశికాంత్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌కు అత్యంత సమీపంగా వున్న షాద్‌నగర్ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.



 విస్తృత ప్రచారంపై దృష్టి




 వ్యాధి నియంత్రణతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగులో 10వేలు, ఉర్దూలో ఏడువేల కరపత్రాలు, 4,500 వాల్‌పోస్టర్లు, 1500 బ్యానర్లు పంపిణీకి సిద్ధంగా ఉంచారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగ న్‌వాడీ కేంద్రాల ద్వారా వ్యాధి లక్షణాలు, నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ ఇందిర సీడీపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామాల్లో ప్రచారం

నిర్వహిస్తారు. గురువారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రత్యేక అధికారి రేమాండ్ పీటర్ శుక్రవారం నుంచి ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు స్వైన్‌ఫ్లూపై అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఎటువంటి సమావేశం నిర్వహించక పోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top