అందరూ భాగస్వాములు కావాలి


జిల్లా జడ్జి నాగమారుతిశర్మ

 టవర్‌సర్కిల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కోర్డు జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్‌లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా చెట్ల పెంపకం చేపట్టడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.

 

 ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు వారసులని, మొక్కలకు తమ పేర్లను పెట్టుకొని బాధ్యతతో పెంచాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మూడు మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములయితేనే ఫలితం పొందుతామని సూచించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించనప్పుడే నగరంలో కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని అన్నారు.

 

 అనంతరం మొక్కలను నాటి, విద్యార్థులకు, స్థానికులకు మొక్కలు, ట్రీగార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవో చంద్రశేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కేవీ.రమణాచారి, కార్పొరేటర్లు ఎడ్ల సరితఅశోక్, వై.సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, ఏవీ.రమణ, మెండి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారధి కళాభారతి బృందం మొక్కల పెంపకంపై ఆలపించిన గీతాలు అలరింపజేశాయి.

 

 హరితోద్యమంలో భాగస్వాములు కావాలి :

 జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ

 సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించినపుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ క్వార్టర్స్‌లో కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వార్టర్స్ ఆవరణ, రోడ్డుకిరువైపులా 300 మొక్కలు నాటారు. చెట్లు లేని ప్రపంచాన్ని ఊహించలేమని, ఇప్పటికే చెట్ల సంఖ్య తగ్గడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నదని ఉమ పేర్కొన్నారు.

 

 అందుకే సీజన్‌లో వర్షాలు కురవకపోవడం, అకాల వర్షాలు పడడం జరుగుతుందన్నారు. భవిష్యత్ ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్ ప్రజా ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టారని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, కార్పొరేటర్ యాదగిరి సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

 కదిలిన జిల్లా యంత్రాంగం

 ముకరంపుర : హరితహారంలో భాగంగా ఆయా శాఖల అధికారులు మొక్కలు నాటేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. నగరంలోని వెటర్నరీ పాలిక్లినిక్‌లో 50 మొక్కలను ఒక ప్లాటుగా.. 200 మొక్కలు పాలిక్లినిక్ ప్రహారీ చుట్టూ నాటారు. ముఖ్య అతిథిగా సీపీవో సుబ్బారావు, పశుసంవర్దకశాఖ జేడీ రాంచందర్, డీడీలు షేక్ ఖలీల్ రహ్మాన్, వెంకటేశ్వర్లు, కిషన్, కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.

 

 కరీంనగర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మొక్కలు నాటారు. మార్కెటింగ్ శాఖ డీడీఎం కృష్ణయ్య, సిబ్బంది. కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 చొప్పదండి మండలం రుక్మాపూర్ ఉద్యానక్షేత్రంలో ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటా రు. ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, ఏడీ జ్యోతి, అసిస్టెంట్ పీడీ మధుసూధన్ పాల్గొన్నారు.

 

 కలెక్టరేట్ ఎదుట ఐసోటీం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను ఉచితంగా అందజేస్తూ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. హౌసింగ్ పీడీ నర్సింగరావు మొక్కను తీసుకుని పేరు నమోదు చేసుకున్నారు. వయోజన విద్య ఉపసంచాలకుల కార్యాలయంలో మొక్కలు నాటారు. ఉపసంచాలకులు ఎం.జయశంకర్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, ఏపీవో దేవదాస్, పర్యవేక్షకులు వి.రాజేందర్‌ఱావు, ఆదిరెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top