పంపిణీకి భూమేదీ?


 సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూపంపిణీపై సందిగ్ధం నెలకొంది. పేద దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15న భూపంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన రాష్ట్రస్థాయి యంత్రాంగం.. లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేపట్టాలని సూచించారు. దీంతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో భూపంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లాలో సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో సర్కారు నిర్దేశించిన సమయానికి భూపంపిణీ జిల్లాలో సాధ్యంకాదని తెలుస్తోంది.



 అంతా గందరగోళమే..

 టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల భూపంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ దిశగా హడావుడి చేస్తున్నప్పటికీ.. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతా అయోమయంగా మారింది. జిల్లాలోని 17 మండలాలు ఔటర్ రింగురోడ్డు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పరిధిలో భూ పంపిణీని నిషేధించారు. దీంతో అవి మినహా.. 20 మండలాలకు సంబంధించి ఒక్కో గ్రామం చొప్పున, ఆయా గ్రామాల్లో 30 మంది లబ్ధిదారుల చొప్పున గుర్తించి.. మొదటి దశలో భూమి పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాలు ఇవ్వాల్సి ఉంది.



 దీంతో ఆరు వందల కుటుంబాలకు 1,800 ఎకరాలు అవసరం. కానీ ఇంత పెద్ద మొత్తంలో భూమి అందుబాటులో లేకపోవడంతో ఈ అంశం జఠిలమైంది. ఒకవైపు భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామంటున్న సర్కారు.. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఒకవైపు సర్కారు భూపంపిణీకి నిర్దేశించిన గడువు దగ్గరపడుతుండగా.. భూమి లభ్యతపై జిల్లా యంత్రాంగానికి స్పష్టత లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది.



 భూ పంపిణీకి జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. తొలివిడతలో భాగంగా ఆరువందల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రాథమిక ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు స్పష్టత రాలేదు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితంవరకు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా ఎంపీడీఓలు, తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపక్రమించింది.



 మొత్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఈనెలాఖరు వరకు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10తేదీ వరకు కొనసాగున్నట్లు అధికారులు చెబుతున్నా.. మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మండలానికో గ్రామం ఎంపిక చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసినప్పటికీ.. జిల్లాలో మాత్రం ఇప్పటివరకు గ్రామాల ఎంపిక పెండింగ్‌లోనే ఉంది. ఇలా పలురకాల అంశాల్లో అస్పష్టత నెలకొనడంతో ఆగస్టు15 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి భూమి పంపిణీ చేయడం అంత సులువుకాదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top