4,381 ఎకరాలు హాంఫట్!


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూదాన భూముల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 11,744 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చిన జిల్లా యంత్రాంగం.. దీంట్లో 4,381 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించింది. భూదానోద్యమ సందర్భంగా చాలామంది దాతలు భూమిని దానం చేశారు. ఈ భూములను కాపాడాల్సిన భూదాన యజ్ఞబోర్డు కాస్తా.. కబ్జాదారులకు కొమ్ముకాయడంతో భూములు అక్రమార్కుల పరమయ్యాయి. పేదలకు జీవనోపాధి కల్పించాల్సిన భూములు పెద్దల అండదండలతో వక్రమార్గంలో పరాధీనమయ్యాయి.



 నగర శివార్లలో విలువైన భూములు కాస్తా రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లగా, కంచే చేను మేసిన చందంగా మరికొన్ని భూములను భూదాన్‌బోర్డు సభ్యులే సొంతం చేసుకున్నారు. దాతలు సహృదయంతో దానం చేసిన భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్లిన వైనాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర సర్కారు.. కొన్నాళ్ల క్రితం భూదాన్‌బోర్డును రద్దుచేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం.. భూముల సమాచారాన్ని సేకరించింది. జిల్లాలో మొత్తం 11,744 ఎకరాల్లో ఇప్పటివరకు 7,363 మేర ఎకరాలు పంపిణీ చేసినట్లు గుర్తించారు. దీం ట్లో 2,951 ఎకరాలు లబ్ధిదారుల ఆధీనంలోనే ఉందని తే లింది. మిగతా 4,363 ఎకరాలు ఇప్పటికీ పంపిణీ కాలేదు.



 4,381 ఎకరాలకు రెక్కలు..

 భూమి లేని నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే సదుద్దే శంతో వినోబాభావే పిలుపు మేరకు దాతలు దానం చేసిన భూముల్లో 4,381 ఎకరాలు అన్యాక్రాంతమైంది. బినామీ పేర్లతో ఈ భూములను కొల్లగొట్టారు. హయత్‌నగర్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇళ్ల స్థలాల పేరుతో భూపందేరం చేశారు. స్థిరాస్తి వ్యాపారుల రూపమెత్తిన భూదాన్ సభ్యులే ఈ తతంగాన్ని తెరవెనుక నుంచి నడిపినట్లు అధికారుల విచారణలో తేలింది. సుమా రు రూ. ఐదారు వేల కోట్ల విలువైన ఆస్తిని కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. భూ దాన్ భూముల రికార్డుల పరిశీలనలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూదాన్ రికార్డులతో సరిపోల్చుకుంటూ.. భూములను ఆసాంతం సర్వే చేసింది.



 వ్యవసాయేతర అవసరాలకు..

 వ్యవసాయమే ఆధారంగా జీవించే పేదలకు పంపిణీ చేయాల్సిన భూమి కాస్తా వ్యవసాయేతర  అవసరాలకు మళ్లింది. మొత్తం భూమిలో 4,931 ఎకరాలు వ్యవసాయానికి అనువుగా ఉండగా, దీంట్లో 2,361 ఎకరాలు భూ వినియోగ మా ర్పిడి జరిగినట్లు సర్వేలో వెల్లడైంది. అంటే ఈ భూమి దాదాపుగా రియల్టర్ల చేతుల్లోకి వెళ్లిందన్నమాట. ఇబ్రహీంపట్నం మండలంలోనే 1,600 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, ఎన్‌ఎస్‌జీ, అక్టోపస్, బీడీఎల్, ఎన్‌ఐఏ తదతర సంస్థలకు కొంత మేర కేటాయించగా, మిగతా భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైంది.



నాగన్‌పల్లి, పొల్కంపల్లి తదితర గ్రామా ల్లో బడా సంస్థలు కూడా భూముల ను వెంచర్లుగా మార్చేసి విక్రయించినట్లు తేలింది. ఇదిలావుండగా, ఇప్పటివరకు పంపిణీ జరగలేదని గుర్తించిన దాంట్లో 4,120 ఎకరాలు ఒరిజినల్ పట్టాదారుల స్థానే ఇతరులు సాగు చేసుకుంటున్నట్లు యంత్రాంగం పసిగట్టింది. 201 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చింది. మరోవైపు రికార్డుల ప్రకారం 2,146 మంది దాతలు భూములను దానం చేసినట్లు ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సంబంధిత కుటుంబాలే చాలావరకు పొజిషన్‌లో ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. సర్వే నివేదికకు తుదిరూపు ఇస్తున్న యంత్రాంగం.. ఒకట్రెండు రోజు ల్లో దీన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top