‘భూ పంపిణీ’కి నిర్లక్ష్యపు చీడ!


- అమ్మేందుకు ముందుకొచ్చిన రైతులు

- సంప్రదింపుల్లో అధికారుల జాప్యం

- నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

- 16 దళిత కుటుంబాలకే భూ పంపిణీ


- జిల్లాలో ఎంపిక చేసిన దళిత కుటుంబాలు : 688

- పంపిణీ చేయాల్సిన భూమి (ఎకరాల్లో)  : 2,064

- కేటాయించిన నిధులు : రూ.10.32 కోట్లు

- ఇప్పటివరకు పంపిణీ (ఎకరాల్లో): 48

- లబ్ధిపొందిన కుటుంబాలు : 16


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది. ప్రభుత్వ భూమి దొరక్కపోతే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసైనా దళితులకు పంపిణీ చేయాలనే సర్కారు మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. అమ్మేవారు లేకపోవడంతో ‘భూ పంపిణీ’లో జాప్యం జరుగుతోందని గతంలో గగ్గోలు పెట్టిన అధికారులు.. తాజాగా 100 ఎకరాలను విక్రయించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చినా పట్టించుకోవడంలేదు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూమిలేని నిరుపేదలకు సగటున మూడెకరాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘భూ పంపిణీ’కి శ్రీకారం చుట్టింది. సర్కారీ భూములు లేకపోతే మార్కెట్ ధరలకు అనుగుణంగా గరిష్టంగా రూ.ఏడు లక్షలు చెల్లించైనా సరే సేకరించమని అధికారులకు దిశానిర్దేశం చేసింది. అయితే భూముల కొనుగోలులో ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినా మన జిల్లా యంత్రాంగం మాత్రం చొరవచూపడంలేదు. ఇప్పటివరకు కేవలం 24 మందికి 72.39 ఎకరాలను మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంది.



దీంట్లో 66.39 ఎకరాలు ప్రైవేటు కాగా, ఆరెకరాలు మాత్రమే ప్రభుత్వానిది. రాజధానికి చేరువలో జిల్లా ఉండడంతో భూముల ధరలు ఆకాశన్నంటాయి. జిల్లాలో ఎకరా ధర కనిష్టం గా రూ.4 లక్షలు పలుకుతోంది. ఈ ధరలను చెల్లించేందుకు ముందుకొచ్చినా అమ్మేవారు లేకపోవడంతో భూపంపిణీకి సరిపడా భూమిని సేకరించలేకపోయారు. అయితే ప్రస్తుతం జిల్లా లో పరిస్థితి మారింది. భూముల ధరలు తగ్గకపోయినప్పటికీ, స్థిరాస్తి వ్యాపారం మాత్రం ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం కునారిల్లింది. దీంతో చాలామంది రైతులు భూముల అమ్మకానికి సిద్ధమవుతున్నారు.



ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు రైతులు భూములను అమ్ముతామని ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అభ్యర్థనలు కూడా పెట్టుకున్నారు. దీంట్లో కుల్కచర్ల, నవాబ్‌పేటలలో 20 ఎకరాల చొప్పున, పూడూరు, యాలాలలో పదెకరాల చొప్పున .. యాచారంలో 40 ఎకరాలను విక్రయించేందుకు భూ యజమానులు ముందుకొచ్చారు. అయితే, భూ యజమానులు దరఖాస్తులను చకచకా పరిష్కరించడంలో ఇటు ఎస్సీ కార్పొరేషన్, ఇటు రెవెన్యూ యంత్రాంగం వేగంగా స్పందించడంలేదు. దీంతో నాలుగు నెలల క్రితం వచ్చిన దరఖాస్తులకు కూడా ఇప్పటికీ మోక్షం కలగలేదు.



లక్ష్యం 2,062 ఎకరాలు

జిల్లాలో 688 మంది దళిత కుటుంబాలకు 2,064 ఎకరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు రూ.10.32 కోట్లను కేటాయించింది. దీంట్లో ఇప్పటివరకు 48 ఎకరాలను మాత్రమే  దళితులకు అందజేసింది. ఎకరా రూ.మూడు లక్షల చొప్పున మొత్తం రూ.122.28 లక్షలతో కొన్న ఈ భూమిని 16 మందికి కేటాయించింది. గుర్తించిన మరో 24 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. రూ.3.65 లక్షల చొప్పున ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి పంపిణీ ఎప్పటికి పూర్తవుతుందో అధికారులకే తెలియాలి. ప్రభుత్వం ప్రాధామ్యాలలో ఈ పథకాన్ని చేర్చినప్పటికీ మన యంత్రాంగం మాత్రం అంతగా దృష్టి సారించినట్లు కనిపించడంలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top