ప్రాజెక్టుల్లో భూసేకరణ కసరత్తు షురూ

ప్రాజెక్టుల్లో భూసేకరణ కసరత్తు షురూ - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన సాగునీటి రంగంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్యను కొలిక్కి తెచ్చి అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తిచేయాలని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది. ప్రజా అవసరాల నిమిత్తం భూమి అమ్మడానికి ఆసక్తి కనబరిచే రైతుల నుంచి భూ సేకరణ చేసే విధివిధానాలు రూపొందిస్తూ ఇటీవల రెవెన్యూ శాఖ జీవో 123 ను ఇచ్చింది. దీనిని ప్రాజెక్టుల పరిధిలోని భూసేకరణకు అన్వయించుకొనే యత్నాలను ప్రభుత్వం ఆరంభించింది.



రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న 29 ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో మొత్తం గా 3.09 లక్షల ఎకరాల భూమి అవసరం ఉండగా అందులో ఈ పదేళ్లలో 2.18 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. దీనికోసం ఇప్పటికే రూ.3 వేల కోట్ల పైన ఖర్చు చేశారు. కొత్తగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతలను మినహాయిస్తే ప్రస్తుత ప్రాజెక్టుల పరిధిలోనే మరో 91,392 ఎకరాలను సేకరించాల్సి ఉంది.



వీటినీ కలుపుకుంటే అది లక్షా 20 వేల ఎకరాలను దాటడం ఖాయం. ఈ భూ సేకరణలో స్థానిక గ్రామాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, మారిన చట్టాలకు అనుగుణంగా చెల్లింపులు జరపాలన్న డిమాండ్, భూసేకరణతో సంబంధం ఉన్న శాఖల మధ్య సమన్వయ లేమి కారణంగా భూసేకరణ ఏడాదిన్నరగా పూర్తిగా పడకేసింది. దీంతో దేవాదుల, ఎల్లంపల్లి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రధాన ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి.



ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ కోసం జిల్లా స్థాయి భూసేకరణ కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా భూమిని సేకరించాలని నిర్ణయిస్తూ జీవో 123 ని విడుదల చేసింది. దీనిప్రకారం సాగునీటి శాఖ తనకు అవసరమయ్యే భూమి వివరాలు తెలుపుతూ జిల్లా కలెక్టర్లను సంప్రదించాలి. దానిపై కలెక్టర్ భూమి అవసరమయ్యే చోట భూ విక్రయానికి రైతులతో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుంది.



కలెక్టర్ ఎంతమంది రైతులు భూ విక్రయానికి ఆసక్తి చూపారో పేర్కొంటూ, భూ అవసరాలు, సేకరించడానికి అవకాశం ఉన్న భూ విస్తీర్ణం వివరాలు సాగునీటి శాఖకు తెలపాలి. దీనికి సాగునీటి శాఖ అంగీకరిస్తే జిల్లా స్థాయి కమిటీ ముందు పెట్టి వారి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ సాగునీటి శాఖ అధికారులకు వివరించేందుకు సోమవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top