వైద్యం మిథ్య..!


► పీహెచ్‌సీల్లో ఖాళీల జాతర

► ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి..

► ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్న రోగులు


ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో పేదలకు సర్కార్‌ వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక.. వైద్యులు, సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని దుస్థితి నెలకొంది. దీంతో రోగులు అప్పు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రాణాలు దక్కితే అదే పది వేలుగా భావిస్తూ సామాన్యులు ఉన్న ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు.


వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటిస్తున్నా నియామకాలు జరగకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెయ్యి జనాభాకు ఒక పడక ఉండాలి.. కానీ జిల్లాలో ఏ పీహెచ్‌సీలోనూ ఐదారు పడకలకు మించి లేవు. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు వెనుదిరగాల్సి వస్తోంది. మైదాన ప్రాంతంలో 20 వేల జనాభాకు, ఏజెన్సీ ప్రాంతంలో 15 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. కానీ ఏ మండలంలో కూడా జనాభా ప్రాతిపదికన పీహెచ్‌సీలు లేవు. దీంతో ప్రజా వైద్యం బహుదూరంగా మారింది.


జిల్లాలో సర్కార్‌ వైద్యం తీరిదీ..

ఆదిలాబాద్‌ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు, ముగ్గురేసి వైద్యులు ఉండాల్సి ఉండగా పలు చోట్ల ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 52 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు గాను ప్రస్తుతం 37 మంది మెడికల్‌ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వీరిలో 16 మంది మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు ఉన్నారు. 21 మంది కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. 34 స్టాఫ్‌నర్సు పోస్టులకు గాను 26 మంది పని చేస్తుండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


మొదటి ఏఎన్‌ఎం పోస్టులు 139 ఉండాల్సి ఉండగా.. 110 మంది పనిచేస్తున్నారు. 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులు 129కి గాను 122 మంది పని చేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులతోపాటు హెల్త్‌ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, హెచ్‌ఈవో, ఇతర పోస్టులు సగం కంటే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రజలు సర్కార్‌ వైద్యానికి నోచుకోవడం లేదు.


పడకలు లేక ప్రైవేటుకు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు లేకపోవడంతో ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కనీసం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పీహెచ్‌సీలలో ఐదారు పడకలు ఉండడంతో రోగులకు సరిపోవడం లేదు. ఆయా పీహెచ్‌సీల్లో 15 నుంచి 20 పడకలు ఉంటే రోగులకు వైద్య సేవలు అందుతాయని మెడికల్‌ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కాగా రోగులు వెళ్లినప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో జనం సర్కార్‌ వైద్యం పొందేందకు ఇష్టపడడం లేదు.


పెరుగతున్న మాతాశిశు మరణాలు

మాతాశిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్పప్పటికీ జిల్లాలో ఫలితం కానరావడం లేదు. ఏడాదికేడాది మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రసవ సమయంలో మాతాశిశు మరణాలు లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లాలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.


రాష్ట్రంలోనే అత్యధికంగా మాత శిశు మరణాలు సంభవించిన జిల్లాల్లో ఆదిలాబాద్‌ జిల్లా ముందు వరుసలో ఉండడం ఈ పరిస్థితికి అద్దంపడుతోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణలన్నట్లు జిల్లాలో మాతాశిశు మరణాలకు పౌష్టికాహార లోపం, మూఢనమ్మకాలు, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఏజెన్సీలోనూ ఇదే తీరు..

ఏజెన్సీ ప్రాంతంలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీలోనూ వైద్య సేవలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు ఆర్‌ఎంపీ, పీ ఎంపీలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గిరిజనులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. వ్యాధులపై అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గిరిజనులు రోగాల బారి న పడి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.


త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ

జిల్లాలో 16 మంది మెడికల్‌ ఆఫీసర్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ నెలలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ అయితే రోగులకు మరింతగా వైద్య సేవలు అందతాయి. ప్రస్తుతం ప్రతీ పీహెచ్‌సీకి ఒక వైద్యుడు ఉన్నారు.   – డాక్టర్‌ తోడసం చందు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top