సిద్దిపేట నుంచి లక్ష మెజారిటీకి కృషి

సిద్దిపేట నుంచి లక్ష మెజారిటీకి కృషి - Sakshi


- రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

- మంత్రి సమక్షంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శంకర్‌గౌడ్ చేరిక

 సిద్దిపేట జోన్: మెదక్ ఉప ఎన్నిక ఫలితాలు బంగారు తెలంగాణ నిర్మాణానికి దిక్సూచిగా మారనున్నాయని, మెజార్టీలో సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు పెద్ద పీట వేస్తారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి స్వగృహంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పల్లె శంకర్‌గౌడ్, డెరైక్టర్ ఆనగోని నారాగౌడ్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడం శుభపరిణామమన్నారు.



సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి లక్ష మెజారిటీ  అందించడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సాధనలో, తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట గడ్డ కీలక పాత్ర పోషించిందన్నారు. అదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మెదక్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పును మరోసారి అందించడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. మెదక్ అభివృద్ధికి ఉప ఎన్నిక ఫలితాలు దోహదపడుతాయన్నారు. నియోజకవర్గానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.



గత ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారని, అదే తరహాలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరోమారు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అనూహ్యమైన తీర్పును అందించాలన్నారు. 13 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినఈ ప్రాంత ప్రజలకు మరోసారి తమ తెలంగాణ వాదాన్ని చాటుకునే అవకాశం ఉప ఎన్నిక ద్వారా దక్కిందన్నారు.



నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నయ్యర్ పటేల్, మాజీ కౌన్సిలర్లు మచ్ఛ వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, నందు, మోహన్‌లాల్, నాయకులు కొండం సంపత్‌రెడ్డి, శేషు కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



‘తెలంగాణ వద్దన్న జగ్గారెడ్డికి ఓట్లు వేయరు’

మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్రం వద్దన్న జగ్గారెడ్డికి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సమైక్య నినాదం వినిపించినందుకే గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు జగ్గారెడ్డిని చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. సమైక్య వాదికి బీజేపీ నాయకులు టిక్కెట్ కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు.



శనివారం మిరుదొడ్డిలో జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అక్బర్ పేట, లక్ష్మీనగర్, మల్లుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు బక్కన్న గారి లక్ష్మి, కొమ్మాట బాలకృష్ణ, తిప్పరమైన రాములు, చిప్ప శివకుమార్, పొగాకు లక్ష్మి, మిరుదొడ్డి ఉప సర్పంచ్ పిట్ల స్వామి, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎర్రోల్ల హంసయ్య తోపాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.



అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ వద్దని వాదించిన జగ్గారెడ్డి తప్ప మెదక్ సీమలో బీజేపీకి కార్యకర్తలే లేరని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించని కాంగ్రెస్ నాయకులకు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిరుదొడ్డి ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ లింగాల జయమ్మ బాల్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు తుమ్మల బాల్‌రాజు, మిరుదొడ్డి ఎంపీటీసీలు గొట్టం భైరయ్య, ధార స్వామి, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి, నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, దుర్గారెడ్డి, వంజరి శ్రీనివాస్ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top